పెద్ద హీరోతో తెలుగు సినిమా అనగానే సంగీత దర్శకులుగా గుర్తొచ్చే పేర్లు కొన్నే. తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుథ్… సర్కిల్ అంతా ఈ ముగ్గురు చుట్టూనే తిరుగుతుంది. ఇకపై ఈ మ్యూజికల్ ఛైర్ లో మరొకరు చేరారు. తనే భీమ్స్. మంచి మాస్ బీట్, ఫోక్ ట్యూన్లు చేస్తుంటాడు భీమ్స్. చిన్న చిన్న సినిమాలతో భీమ్స్ ప్రయాణం మొదలైంది. `ధమాకా`లో తాను ఇచ్చిన అన్ని పాటలూ హిట్టే. ఆ సినిమాకు పాటలే బలం.. ప్రాణం. నిజానికి ధమాకా తరవాత భీమ్స్ పెద్ద హీరోల దృష్టిలో పడతాడని అనుకొన్నారు. కానీ ఎందుకో.. ఆ స్థాయిలో అవకాశాలు రాలేదు. `సంక్రాంతికి వస్తున్నాం` రూపంలో ఓ ఛాన్స్ అందుకొన్నాడు. ఈ సినిమా కోసం కూడా భీమ్స్ బాగా శ్రమించాడు. ముఖ్యంగా గోదారి గట్టుపైన పాట చాట్ బస్టర్ అయ్యింది. ఈ పాట వినగానే జనంలోకి వెళ్లిపోయింది. ప్రమోషన్లకు ఈ పాట బాగా ఉపయోగపడింది. నేపథ్య సంగీతం విషయంలోనూ భీమ్స్ తన మార్క్ చూపించాడు. కొన్నిచోట్ల సన్నివేశానికి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. `హాయ్` అనే పదానికి వెంకీ ఎబ్రివేషన్ చెప్పినప్పుడు వెనుక వినిపించిన స్కోర్ సరదాగా వుంది.
ఈ హిట్టుతో భీమ్స్ హైవే ఎక్కేసినట్టే. పెద్ద హీరోలకు తాను మంచి ఆప్షన్ అనే విషయం నిరూపించుకొన్నాడు. యాక్షన్ డ్రామాలకు భీమ్స్ ఏ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తాడో చూడాలి. ఎందుకంటే.. ఈమధ్య ఎలివేషన్ సీన్లకు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకంగా మారింది. పాటలు యావరేజ్‌గా ఉన్నా, ఆర్.ఆర్ కు మాత్రం బాక్సులు బద్దలైపోయే ఎఫెక్టులు కోరుకొంటున్నారు ఫ్యాన్స్. తమన్ రాణించేది అక్కడే. ఈ విషయంలో భీమ్స్ కాస్త ఫోకస్ చేస్తే తను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు. చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి కూడా భీమ్స్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి సినియమా అంటే పాటల విషయంలో అంచనాలు ఎక్కువగా ఉంటాయి. మాస్ ఎలిమెంట్స్ కూడా ఉండాల్సిందే. ఓరకంగా భీమ్స్‌కి ఇది పరీక్ష. ఇక్కడ గనుక భీమ్స్ పాసైపోతే… తన కెరీర్ పూర్తి స్థాయిలో సెటిల్ అయిపోయినట్టే.