Bhimaa Movie Review Telugu
తెలుగు360 రేటింగ్: 2.25/5
-అన్వర్
అనుకొంటాం కానీ, కమర్షియల్ సినిమాలు తీయడం అంత తేలిక కాదు. ఫైట్లూ, పాటలూ, హీరోయిజం.. ఇవి ఉంటే చాలు, కమర్షియల్ సినిమా అయిపోతుంది అనుకొనే రోజులు పోయాయి. ఫైటుకి ఎమోషన్ తోడవ్వాలి. హీరోయిజం చుట్టూ బలమైన కథ ఉండాలి. పాటలంటారా.. అవి లేకపోయినా కిక్ ఇచ్చేంత విషయం కథనంలో కావాలి. ఇవన్నీ ఉంటేనే కమర్షియల్ సినిమాలు ఆడుతున్నాయి. ఇంకా పాత ఫార్ములానే ఎంచుకొంటాం, రొడ్డ కొట్టుడు కథలే తీస్తాం అంటే చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. కమర్షియల్ కథలు చేస్తూ, అందులో విజయాలు వెతుక్కొనే గోపీచంద్ లాంటి హీరోలకు ఇప్పుడు కష్టకాలం ఎదురైంది. తమ ఫార్ములాని వదిలి బయటకు రాలేకపోతున్నారు. అందులో కొత్తదనం లేనప్పుడల్లా పరాజయాలు కొని తెచ్చుకొంటున్నారు. గోపీచంద్ కెరీర్ కొంతకాలంగా ఆటుపోట్లని ఎదుర్కోవడానికి కారణం అదే. వరుస ఫ్లాపుల తరవాత ‘భీమా’గా అవతారం ఎత్తాడు. సినిమా పూర్తిగా కమర్షియల్ అని టీజర్, ట్రైలర్లో తేలిపోయింది. అయితే ఈసారి ఏదో ఓ కొత్త పాయింట్ పట్టుకొన్నాడన్న ధీమా కనిపించింది. మరి ఆ ధీమా ఏమైంది? ఈ ‘భీమా’ ఎలా ఉంది?
కర్నాటకలోని మహేంద్రగిరిలో ఓ మహిమ గల శివాలయం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల దశాబ్దాలుగా ఆ ఆలయాన్ని మూసేస్తారు. అక్కడకి ఎస్.ఐగా వస్తాడు భీమా (గోపీచంద్). తన హీరోయిజంతో మహేంద్రగిరిని పట్టి పీడిస్తున్న గుండాలు, రౌడీల ఆట కట్టిస్తాడు. అయితే ఆ గుడి చుట్టూ.. ఏదో జరుగుతోందన్న విషయం భీమాకు అర్థం అవుతుంది. దాంతో పాటు కొన్ని అనుమానాస్పద విషయాలు ఆ ఊర్లో జరుగుతుంటాయి. వాటి వెనుక ఉన్న కథేమిటి? ఆ ఆలయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాలి.
దర్శకుడు రాసుకొన్న కథలో విషయం ఉంది. మిస్టరీ, ఫాంటసీ, దైవత్వం, ఆత్మ.. వీటికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అయితే అవన్నీ కలగాపులగం అయిపోవడమే అసలు సమస్య. ఓ గుడిని చూపించి, దాని విశిష్టత చెబుతూ, పురాణాలతో ఓ లింకు పెడుతూ ఈ కథని మొదలెట్టిన తీరు ఆసక్తికరంగానే సాగింది. అయితే హీరో ఎంట్రీకి ముందూ, ఆ తరవాత వచ్చే సన్నివేశాలు దర్శకుడి ఆలోచనల తాలుకూ డొల్లతనాన్ని బయటపెడతాయి. వెన్నెల కిషోర్ ట్రాక్, అందులోంచి పుట్టించిన కామెడీతోనే ప్రేక్షకుల సహనానికి పరీక్ష మొదలైపోతుంది. హీరో ఎంట్రీ.. ఆ సమయంలో వచ్చే ఫైటుతో అది మరింత ముదురు తుంది. రౌడీలకు ఆఫర్లు ఇచ్చి, హీరో ఫైటింగులు చేయడం 80ల నాటి ఆలోచన. ‘కింద పడకుండా కొడతా.. గాల్లో ఉంటేనే తంతా’ అంటు మరీ హీరోలు ఫైటింగులు చేసిన జమానాని ఎప్పుడో దాటి వచ్చేశాం. ఇప్పుడు మళ్లీ అదే చూపిస్తానంటే ఎలా..?
అసలు ఫస్ట్ ఫైట్ కే.. ఆ ఊరి సమస్య దాదాపు తీరిపోయింది. కానీ అలా చేస్తే కుదరదు కదా? మరో రెండు గంటల సినిమా చూపించాలి కదా. అందుకే హీరో.. విలన్ కి.. ఓ ఆఫర్ ఇస్తాడు. ‘నెల రోజులు నేను వెకేషన్లో ఉంటా. ఈలోగా నువ్వేమైనా చేస్కో’ అంటాడు. ఆ తరవాత అసలు హింస మొదలవుతుంది. హీరో – హీరోయిన్ల లవ్ ట్రాక్ గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. పోలీస్ స్టేషన్లో హీరో, కానిస్టేబుల్స్ చేసే కామెడీ చూస్తే… అట్నుంచి అటు ఏ అండమాన్‌కో, ఆఫ్రికా అడవుల్లోకో పారిపోవాలనిపిస్తుంది. హీరోయిన్‌కి దాదాపు వ్యాంపు పాత్రకు దింపేశారు. అంతకు ముందు సీన్లోనే హీరో పోలీసుల కర్తవ్యం గురించి వీర లెక్చర్ ఇస్తాడు. ఆ వెంటనే సమస్య చెప్పుకోవడానికి స్టేషన్‌కి వచ్చిన అమ్మాయి బ్యాకు చూసి మోహంలో పడిపోతాడు. ఇలాంటి సిల్లీ సీన్లు తీస్తే కథపై, హీరో చేసే పనులపై సీరియస్ నెస్ ఏం వస్తుంది? ఎందుకు వస్తుంది?
ఈ కథని ఫక్తు కమర్షియల్ కోణంలో చెప్పాలా, లేదంటే సీరియస్‌గా నడపాలా? విషయంలో దర్శకుడికి క్లారిటీ లేకుండా పోయింది. దాంతో చాలా సన్నివేశాలు అటూ – ఇటూ ఊగిసలాడాయి. మహేంద్రగిరిలో ఏం జరుగుతోందన్న విషయంపై ఇంట్రవెల్‌కి కూడా ఓ క్లారిటీ రాదు. ద్వితీయార్థంలో `రామా`ని దింపాడు దర్శకుడు. నిజానికి ఇది కూడా తెలివైన ఆలోచనే. కాకపోతే.. ఆ పాత్రని పూర్తిగా డల్ చేసేశాడు. ఆ ట్రాక్‌లోనూ పదును లేదు. చివరి 20 నిమిషాలూ కాస్త పట్టుగా సాగింది. ఆ ఎపిసోడ్ దర్శకుడు సీరియస్ గా తీశాడు. అక్కడ విజువల్స్ కూడా బాగా కుదిరాయి. అదే శ్రద్ధ మిగిలిన 2 గంటల సినిమాపై పెడితే.. భీమా అవుట్ పుట్ మరో రేంజ్లో ఉండేది. కొన్ని కథలు వింటున్నప్పుడు బాగుంటాయి. కానీ.. ట్రీట్మెంట్ సరిగా కుదరదు. ‘భీమా’లోపం కూడా అదే. సినిమా `రన్` పేలవంగా ఉంది. ఫస్టాఫ్ లో హీరో చేసే కామెడీ, లవ్ ట్రాక్ ఇవేం సరిగా ఉడకలేదు. కాలక్షేపం కోసం రాసుకొన్న సీన్లు కూడా తేలిపోయాయి. ఫస్టాఫ్ అవ్వగానే సినిమాపై ఓ అభిప్రాయానికి వచ్చేస్తాడు ప్రేక్షకుడు. సెకండాఫ్‌లో కాస్త విషయం ఉన్నా – అదేం పెద్దగా రిజిస్టర్ కాదు. గుడి వెనుక ఏం జరుగుతుందన్న విషయంలో ప్రేక్షకుడికి కాస్త ఆసక్తి ఉంటుంది. కానీ దాన్నీ చాలా రొటీన్‌గా నడిపాడు. విలన్ ఎవరో ప్రేక్షకులు తెలుసుకోలేనంత సస్పెన్స్ కథనంలో లేదు. తీరా అసలు విలన్ రివీల్ అయ్యాక `మనం ఊహించిందే కదా` అని ప్రేక్షకుడు శాటిస్పై అవుతాడంతే!
గోపీచంద్ లుక్ బాగుంది. క్లైమాక్స్‌లో తన నటన బాగుంది. ఆ ఎమోషన్ సినిమా అంతా ఉంటే ఇంకా బాగుండేది. హీరో క్యారెక్టర్ని మాస్‌కి నచ్చేలా డిజైన్ చేద్దామనుకొన్నాడు దర్శకుడు. కానీ.. ఆ సన్నివేశాల్లో బలం లేకపోవడం, కామెడీ పండకపోవడంతో గోపీచంద్ పడిన కష్టం వృధా అయ్యింది. మాళవిక శర్మ పాత్ర ఉపయోగం లేనిదే. కాకపోతే చివర్లో కథకు లింకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రియాభవానీ శంకర్ కూడా అంతంత మాత్రమే. వెన్నెల కిషోర్ సైతం నవ్వించలేకపోయాడు. నరేష్ `ముదర` ప్రేమ.. దానికోసం రాసిన డైలాగులు సహనానికి పరీక్ష పెడతాయి. బలమైన విలన్ ఈ కథలో కనిపించకపోవడం మరో మైనస్.
యాక్షన్ సినిమా అనగానే సంగీత దర్శకుడిగా కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్‌ని రంగంలోకి దింపేస్తున్నారు. అయితే కథలో, ఫైటులో ఎమోషన్ లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు? పాటలు రిజిస్టర్ కావు. టైటిల్ సాంగ్ వచ్చే ప్లేస్ మెంట్ సిల్లీగా అనిపిస్తుంది. నిర్మాత భారీగా ఖర్చు పెట్టాడు. నిర్మాణంలో క్వాలిటీ ఉంది. మాటలు అత్యంత పేలవంగా ఉన్నాయి. ‘నీ పేరు భీమా కదా.. మరి గద ఏదీ’ అని ఓ పాత్ర అడిగితే.. ‘నీ పంచె కింద దూర్చా..’ అంటాడు హీరో. దాదాపు మాటలన్నీ ఇలానే సాగాయి. కమర్షియల్ సినిమాల్లో లాజిక్కులు లేకపోయినా ఫర్వాలేదు. కానీ.. కనీసం ఎమోషన్ వర్కవుట్ అవ్వాలి. అది.. ఈ సినిమాలో మిస్సయ్యింది.
ఫినిషింగ్ టచ్: నువ్వే కాపాడాలి రామా!
తెలుగు360 రేటింగ్: 2.25/5
-అన్వర్