హైదరాబాద్: భీమవరంలో ఇటీవల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు, ప్రభాస్ ఫ్యాన్స్‌కు మధ్య గొడవ జరగటం, పట్టణంలో 144 సెక్షన్ విధించటం, పవన్ ఫ్యాన్స్‌ను పోలీసులు అరెస్ట్ చేయటం తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్వయంగా జోక్యం చేసుకుని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుకు, నరసాపురం ఎంపీ గోకరాజు రంగరాజుకు, మంత్రి కామినేని శ్రీనివాస్‌కు ఫోన్ చేసి సమస్యను పరిష్కారం చేయాలని కోరాల్సివచ్చింది. ఆ నేతల సహకారంతో పవన్ ఫ్యాన్స్‌ను పోలీసులు విడుదల చేసారు.
బయటకొచ్చిన అభిమానులకు భీమవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు రామాంజనేయులు క్లాస్ పీకారు. బాహుబలి చిత్రం విడుదల సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ భీమవరం పట్టణమంతా హడావుడి చేసి ఒంటెలు, ఏనుగులు, గుర్రాలతో ఊరేగింపు చేశారని – ఊరంతా బ్లానర్లు కట్టారని, పవన్ జన్మదినం సందర్భంగా ఇప్పుడు తాము బ్యానర్లు కడితేమాత్రం వాటిని ప్రభాస్ ఫ్యాన్స్ పీకేశారని ఆరోపించారు. దానితో తాము ఆగ్రహానికి గురయ్యామని ఎమ్మెల్యేకు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ, అలాంటిదేమైనా ఉంటే పెద్దవాళ్ళైన ఎమ్మెల్యేకో, ఎంపీకో, ఇతర నాయకులకో చెప్పి పరిష్కరించుకోవాలిగానీ గొడవకు దిగకూడదని చెప్పారు. గొడవకు ఏమాత్రం సంబంధంలేని కళాశాలపై దాడికి దిగటం తప్పని చీవాట్లు పెట్టారు. మీకేమైనా జరిగితే మీ ఇళ్ళలోనివారు ఎంత బాధపడతారో ఆలోచించుకోవాలని సూచించారు.
ఫ్యాన్స్ మధ్య గొడవ రెండు సామాజికవర్గాల మధ్య గొడవగా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్థికంగా బలంగా ఉండగా, పవన్ ఫ్యాన్స్ సంఖ్యాపరంగా బలంగా ఉన్నారు. పవన్ జోక్యం చేసుకోవటంతో గొడవ ప్రస్తుతానికి శాంతియుతంగా పరిష్కారమయింది. ఎమ్మెల్యే రామాంజనేయులు మంత్రి గంటా శ్రీనివాసరావుకు వియ్యంకుడు.