ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. హైదరాబాద్ లోని చాలా ముఖ్య ప్రాంతాల్లో ఉండని రేట్లు ఏపీలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఉంటాయి. ఉదాహరణకు భీమవరం లో ఇళ్లు,స్థలాల ధరలు హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌తో పోటీ పడుతూంటాయి.
భీమవరం పరిసరాల్లో రొయ్యల సాగు, చేపల పెంపకం, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు చాలా ఎక్కువ. భారీ పారిశ్రామిక వేత్తలు కన్నా.. మధ్యతరహా పారిశ్రామికవేత్తలు ప్రతి వీధిలోనూ కనిపిస్తూంటారు. అంతే కాకుండా భీమవరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు,ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కూడా ఎక్కువ. ఇలాంటి వారిలో ఎక్కువ మంది భీమవరం రియల్ ఎస్టేట్ లోనే పెట్టుబడులు పెడుతున్నారు. రాజమండ్రి, కాకినాడ వంటి పెద్ద నగరాలతో పోలిస్తే భీమవరం విస్తరణకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న భావన ఉంది.
భీమవరంలో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇటీవలి కాలంలో రోడ్లనూ బాగు చేశారు. భీమవరంలో స్థలాల ధరలు ఎక్కువగా ఉంటాయి. ప్రధాన రహదారుల సమీపంలో ఉన్న స్థలాలు ఎకరానికి ఐదు కోట్ల వరకూ రేటు ఉంటుంది. కాస్త లోపలికి వెళ్లినా కోటికి తక్కువ ఉండదు. భీమవరంలో కమర్షియల్ కాంప్లెక్స్ లు రేటు గజానికి లక్షల్లోనే ఉంటుంది.
భీమవరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఒకటి గునుపూడి. ఈ ప్రాంతంలో విలాసవంతమైన గృహాలు మరియు అపార్ట్మెంట్లు నిర్మాణంలోఉన్నాయి. నరసాపురం-భీమవరం రోడ్డు, రాయలం వంటి ప్రాంతాల్లో లేఅవుట్లు, వ్యవసాయ భూములకు డిమాండ్ ఎక్కువగా ఉంది. భీమవరం పురపాలక సంఘం ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులను ప్రతిపాదించింది.
నరసాపురం-భీమవరం రోడ్డును 40 అడుగుల నుండి 60 అడుగులకు విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవన్నీ భీమవరంను హాట్ ప్రాపర్టీగా మారుస్తున్నాయి.