చిరంజీవి… మెహర్ రమేష్ కాంబినేషన్ అనగానే అంతా విస్తుపోయారు. శక్తి తరవాత మెహర్ రమేష్‌కి ఛాన్స్ ఇవ్వడం అంటే పెద్ద సాహసమే. కాకపోతే.. ఇది రీమేక్ సినిమా. ఉన్నది ఉన్నట్టు తీయడానికి దర్శకుడు ఎవరైతే ఏమిటి? అని సర్దుకుపోవొచ్చు. పైగా చిరంజీవికి రీమేక్ సినిమా ఎప్పుడూ సేఫ్ జోనరే. ఆచార్యలా డిజస్టర్ అయితే కాదు. గాడ్ ఫాదర్ లా మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఆ భరోసాతో.. భోళా శంకర్‌పై ఓ మాదిరి అంచనాలు పెట్టుకొన్నారు.
అయితే.. వేదాళంని ఉన్నది ఉన్నట్టు తీయలేదు. దాదాపు 70 శాతం మార్పులూ, చేర్పులూ చేసేశాడు. ఈ విషయాన్ని మెహర్ రమేష్ స్వయంగా చెప్పాడు. మరో కీలకమైన విషయం ఏమిటంటే.. చిరు ఎంటర్ అయిన తరవాత ఈ మార్పులు జరగలేదు. మార్పులు చేశాకే.. పూర్తి స్క్రిప్టుతో చిరు దగ్గరకు వెళ్లారు. ఆ మార్పులు చిరుకి నచ్చాయి. అంతే.. ఈ సినిమా పట్టాలెక్కింది. ఓరకంగా భోళా శంకర్ ఒర్జినల్ స్టోరీ అనుకోవాలి. రెండ్రోజుల్లో సినిమా విడుదల అవుతోంది. బాగుంటే.. క్రెడిట్ మెహర్కే. రిస్క్ కూడా తనపైనే ఎక్కువ. భోళా వేదాళంలా తీసినా… కనీసం యావరేజ్ మార్క్ దగ్గర ఆగేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతారు. రీమేక్ కూడా తీయడం చేతకాదని విమర్శలు ఎక్కువవుతాయి. వీటన్నింటికీ సిద్ధపడే మెహర్ రమేష్ వేదాళం లాంటి కథని పట్టుకొని, దానికి తెలుగు నేటివిటీ జొప్పించి, చిరు స్టైల్‌ని యాడ్ చేశాడు. మరి ఈ మేళవింపు కుదిరిందో, లేదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగితే సరిపోతుంది. ఏదేమైనా… మెహర్ కెరీర్లో ఇది.. డూ ఆర్ డై సెట్యువేషన్. శక్తి, షాడో ఫ్లాపులతో మరో సినిమా తీయడానికి ఇన్నేళ్లు పట్టింది. భోళా కూడా తేడా కొడితే… మెహర్ తో మరో సినిమా తీయడానికి నిర్మాతలు ఇక సాహసించకపోవొచ్చు.