తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా `వేదాళం`. తెలుగులో చిరంజీవితో `భోళా శంకర్`గా తెరకెక్కిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకుడు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం వైభవంగా ప్రారంభమైంది. రాఘవేంద్రరావు, కొరటాల శివ, బాబి, వినాయక్ తదితరులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుందన్న నమ్మకం ఉందని నిర్మాతలు అనిల్ సుంకర, కె.ఎస్ రామారావు తెలిపారు.
”ఈ సినిమా కోసం మెహర్ రమేష్ డే అండ్ నైట్ వర్క్ చేశారు. దాదాపుగా వర్జినల్ వెర్షన్ లా తయారు చేశారు. సరిలేరు నీ కెవ్వరుతో తమన్నా మా లక్కీ ఛార్మ్ అయ్యింది. తనని ఈ సినిమాతో మరోసారి రిపీట్ చేస్తున్నా”మని అనిల్ సుంకర తెలిపారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ”చాలా సంవత్సరాల తరవాత… ఇది నా జీవితంలో గొప్ప రోజు. మెహర్, అనిల్ సుంకర ఇద్దరూ… చిరంజీవిగారికి దగ్గర నన్ను దగ్గర చేసి, ఓ మంచి సినిమా తీయిస్తున్నారు. చిరంజీవిగారితో సినిమా చేయాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా. ఇద్దరి మధ్యా ఎందుకో తెలియని గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో నా పాత్రికేయ మిత్రుల భాగస్వామ్యం కూడా ఉంటుంది. రమేష్ తెలివి తేటలు, అనిల్ అమెరికన్ డాలర్లతో… ఈ సినిమాని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దుతామన్న నమ్మకం ఉంద”న్నారు.