భోలే బాబా పాద ధూళితో జీవితాలు మెరుగుపడుతాయని ఆ భక్తులంతా ఆశపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన వెతలు తీరుతారని బాబా పాదధూళి కోసం ఎగబడ్డారు. కానీ, ఆ మట్టికోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన యూపీలోని హత్రాస్ జిల్లా ఫుల్ రయీలో చోటు చేసుకుంది.
ప్రసిద్ది చెందిన భోలే బాబా దర్శనం కోసం మంగళవారం భక్తులంతా ఒక్కసారిగా ఎగబడటం..బాబా పాదధూళి సేకరించే ప్రయత్నంతో ఊహించని విధంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 116మంది మృతి చెందగా.. వందల మంది గాయపడ్డారు. మృతుల్లో 108మంది మహిళలు, 7చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
భోలే బాబా సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. మంగళవారం చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. బాబా పాదధూళి సేకరించేందుకు పెద్దఎత్తున ఒకేసారి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలు ఎక్కడికక్కడ చెల్లాచెదురై పడి ఉండటం, మృతదేహాల పక్కనే స్పృహ కోల్పోయిన వారు ఉండటం.. క్షతగాత్రులు సహాయం కోసం ఎదురు చూస్తుండటం..ఈ హృదయవిదారక దృశ్యాలు అందర్నీ కలిచివేశాయి.
హాహాకారాలతో ఆసుపత్రి ప్రాంగణం పెను విషాదమయంగా మారింది. మృతుల కుటుంబాల ఆర్తనాదాలు స్థానికుల హృదయాలను బరువెక్కించాయి. బాబా మట్టి మిమ్మల్ని అదే మట్టిలో పాతిపెట్టిందంటూ మృతుల బంధువులు రోదించడం తీవ్రంగా కలిచివేసింది.