“వైకాపా కూలిపోయే చెట్టు వంటిది కనుక దాని నీడలో సేద తీరాలని ఎవరూ అనుకోరు. అనుకొంటే వారికే ప్రమాదం. రాజకీయ నేతలు తమకి ఎక్కడ మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతారో అక్కడికే వెళ్తారు. మేము అంతే. అధికారం, డబ్బు, పదవులకి ఆశపడి వచ్చామనే ఆరోపణలలో నిజం లేదు. అదే నిజమయితే ప్రతిపక్షంలో ఉన్న వైకాపాలోకి ఒకప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఎందుకు చేరారు?” ఈ మాటలన్నది ఎవరో కాదు నిన్న మొన్నటి వరకు తెదేపాతో పోరాడుతూ వైకాపాలో ముఖ్య నాయకుడిగా ఉన్న భూమా నాగిరెడ్డి.
ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడారు. జగన్ చేయబోయే దీక్ష గురించి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు టీవీలలో చూసే తెలుసుకొన్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. కేంద్రంతో తెగతెంపులు చేసుకోమని జగన్ పదేపదే చంద్రబాబు నాయుడిని కోరుతుంటారు. కానీ తెగతెంపులు చేసుకొంటే ఏమవుతుంది? ఇంక డిల్లీలో మన మాట వినేవాళ్ళే ఉండరు. అప్పుడు రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుంది,” అని భూమా నాగిరెడ్డి అన్నారు.
జగన్ గురించి భూమా చెప్పిన మాటలు గమనిస్తే జగన్ పార్టీలో సీనియర్లని సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొంటారనే విమర్శలు నిజమని నమ్మవలసి వస్తోంది. వైకాపా నుండి మున్ముందు ఇంకా వలసలు ఉండవచ్చని సూచిస్తున్నట్లుంది.