ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి జగన్ పై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన ఆగ్రహానికి కారణం ఏమిటంటే తాము డబ్బుకి అమ్ముడుపోయామని జగన్, వైకాపా నేతలు పదేపదే అఆరోపించడమే.ఈ విమర్శలు మరెవరో నేతలు చేసి ఉండి ఉంటే వాటికి అంత విలువ ఉండేవి కావు. పట్టించుకోవలసిన అవసరం ఉండేది కాదు. కానీఒకప్పుడు జగన్ కి కుడిభుజంగా వ్యవహరించిన భూమా నాగిరెడ్డి చేయడం వలననే వాటికి ప్రాధాన్యత ఏర్పడింది.
తన కుటుంబం గత 30 ఏళ్లుగా రాజకీయాలలో ఉందని, అటువంటి తనను డబ్బుకి అమ్ముడుపోయానని ఏవిధంగా అనగలుగుతున్నారని భూమా ప్రశ్నించారు. బ్రిటిష్ కాలం నుండే మాది డబ్బున్న కుటుంబం. డబ్బు కోసం రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు మాకు. ఆనాడు మేము ఎలాగా ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉన్నాము. ఆ సంగతిప్రజలందరికీ తెలుసు. అయినా కూడా వైకాపా నేతలు పదేపదే మేము డబ్బుకి అమ్ముడుపోయామని ఆరోపిస్తుంటే మనసుకి చాలా బాధ కలుగుతోంది. అందుకే స్పందించవలసి వస్తోంది. మళ్ళీ మరొకసారి అటువంటి ఆరోపణలు చేసినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని భూమా వైకాపా నేతలని హెచ్చరించారు.
“జగన్మోహన్ రెడ్డికి నిజంగా ధైర్యం ఉంటే తన ఆస్తుల వివరాలను ప్రకటించమనండి..మేము కూడా ప్రకటిస్తాము. అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు ఎవరికి డబ్బు యావ ఉందో?” అని భూమా సవాలు విసిరారు.
“మీ తండ్రిగారు కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పోగానే మీరు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఎందుకు బయటకి వచ్చారో నిజాయితీగా చెపితే మీ ఆరోపణలకి నేను సమాధానం చెపుతాను. మీకు ఎలాగయినా ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంది. అది నెరవేరకపోవడంతో కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చి స్వంత పార్టీ పెట్టుకొన్న మాట నిజం కాదా?” అని భూమా ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు తెలియవు. పార్టీని బలపరుచుకోవడం చేతకాదు. ఎవరూ చెపితే వినరు. చంద్రబాబు నాయుడుని తిట్టడమే ఆయన రాజకీయం అనుకొంటారని భూమా అన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ లోపాల గురించి చర్చించుకోవాలి. ఎమ్మెల్యేలు పార్టీని ఎందుకు విడిచిపోతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలి. కానీ అదేమీ చేయకుండా చంద్రబాబు నాయుడుని తిట్టడానికే సమావేశం పెట్టుకొన్నట్లుగా ఒకరి తరువాత మరొకరు పోటీ పడి మరీ చంద్రబాబుని తిట్టారు. జగన్ మెప్పు పొందడానికే వారు ఆవిధంగా మాట్లాడారని అర్ధమవుతూనే ఉంది.
ఎదుట వాళ్ళకి నైతిక విలువల గురించి పాఠాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి, ఒకప్పుడు అసెంబ్లీలో తన తల్లి తండ్రులని, తనని, చెల్లెలి షర్మిలని తిట్టినా వారిని ఇప్పుడు ఎందుకు పక్కన చేర్చుకొన్నారు…రాజకీయాల కోసం కాదా? ఇదేనా మీరు పాటించే నైతికవిలువలు? ఒకపక్క మీ పార్టీ నేతలు తెలంగాణా ప్రాజెక్టులు సబ్ కాంట్రాక్టులు చేసుకొంటుంటారు. మరోపక్క మీరు వాటిని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షలు చేస్తుంటారు. నేను చేసిన ఈ ఆరోపణలు అబద్దమని మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? అంటే అర్ధమేమిటి?” అని భూమా ప్రశ్నించారు.
శాసనసభలో హుందాగా వ్యవహరించాలని తాను, జ్యోతుల నెహ్రు చాలాసార్లు చెప్పామని కానీ జగన్ తమ మాటలని ఎన్నడూ ఖాతరు చేసేవాడుకాడని భూమా అన్నారు. జగన్ కి అహంభావం చాలా ఎక్కువని ఆయన దగ్గిర పనిచేయడం చాలా కష్టమని అన్నారు.
“జగన్ నన్ను రాజీనామా చేయమని కోరుతున్నారు. అందుకు నేను సిద్ధమే. నాతోబాటు జ్యోతుల నెహ్రు, ఎస్వీ మోహన్ రెడ్డి కూడా రాజీనామా చేస్తాము. ఆళ్లగడ్డ నుంచి కానీ వాళ్ళు సూచించిన మరే ప్రాంతం నుంచి కానీ మేము పోటీ చేసి విజయం సాధించగలము. మేము విజయం సాధిస్తే జగన్ పార్టీ మూసుకొని వెళ్లిపోతారా? మా సవాలు స్వీకరించడానికి జగన్ సిద్దమేనా? అయన సిద్దమైతే రేపే మేము రాజీనామాలు చేస్తాము” అని భూమా సవాలు విసిరారు.