జనసేన పార్టీలోకి వెళ్లాల్సిన ఖర్మ తనకు పట్టలేదని… మంత్రి భూమా అఖిలప్రియ …తేల్చి చెప్పేశారు. కొద్ది రోజులుగా ఆమె పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తన అనుచరుల ఇళ్లలో కార్డన్ సెర్చ్ చేశారన్న కారణంగా ఆమె.. గన్ మెన్లను వెనక్కి పంపారు. దీన్ని టీడీపీ నేతలు కూడా సీరియస్ గా తీసుకోలేదు. కానీ మంత్రిగా ఆమె పర్యటనకు పోలీసులు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నారు. సెక్యూరిటీని వెనక్కి పంపడంతో.. ఆమె పార్టీ మారబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. మొదట్లో..వైసీపీలో చేరుతారని చెప్పుకున్నా.. తర్వాత రెండు, మూడు రోజుల నుంచి మాత్రం… జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. జనసేన అనుకూల సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ పార్టీ మార్పు వార్తలపై.. భూమా అఖిలప్రియ .. జనసేన పరువుపోయేలా స్పందించారు. జనసేనలో చేరాల్సిన ఖర్మ తనకు పట్టలేదని తేల్చారు. అంటే.. ఏ పార్టీలో… అవకాశం లేకపోతే… జనసేనలో చేరుతారన్నట్లుగా.. తనకు అంత ఖర్మ పట్టలేదని చెప్పుకొచ్చారు. అఖిలప్రియ రెస్పాన్స్ చూస్తే.. ఆమె రాజకీయ పరంగా.. అసలు జనసేనను ఓ పార్టీగా పరిగణించడం లేదని.. మాత్రం తేలిపోయింది. ఆమె తల్లిదండ్రులు… చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు టీడీపీ వీడి అందులో చేరిపోయారు. ఆళ్లగడ్డ నుంచి ఆమె తల్లి శోభానాగిరెడ్డి గెలిచినా నంద్యాల పార్లమెంట్ నుంచి భూమా నాగిరెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంలో వారే కీలక పాత్ర పోషించారన్న ప్రచారం ఉంది.
భూమా నాగిరెడ్డి వారసురాలిగా తండ్రి నీడలో ఎమ్మెల్యేగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న.. అఖిలప్రియకు.. టీడీపీలో రాజకీయం చేయడం ఇబ్బందికరంగా మారింది. సొంత వర్గాన్ని… ముఖ్యంగా భూమా నాగిరెడ్డికి కుడిభుజంలా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డితో వైరం పెట్టుకున్నారు. ఫలితంగా.. సగం వర్గం దూరమయింది. ఆ తర్వాత కూడా అంతే దూకుడుగా వ్యవహరిస్తూ.. తరచూ పార్టీ మారబోతున్నారనే ప్రచారానికి కారణం అవుతున్నాయి. అయితే.. ఇప్పటికి మాత్రం.. టీడీపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఆళ్లగడ్డ అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇస్తున్న చంద్రబాబుకు ఎందుకు దూరం అవుతానని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు.