నంద్యాల రాజకీయం రసకందాయంలో పడింది! ముఖ్యంగా అధికార పార్టీ తెలుగుదేశం అభ్యర్థి విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అభ్యర్థి విషయంలో ఇప్పటికీ ఒక స్పష్టత రాలేదనే చెప్పాలి. భూమా వర్గం, శిల్పా మోహన్ వర్గాలు ఇద్దరూ పోటీకి సిద్ధమన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. అయితే, ఈ రెండు వర్గాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడివిడిగా భేటీ అయ్యారు. రాజీ ఫార్ములా కుదిరిందని అనుకున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే… ఏ వర్గమూ తగ్గేట్టు కనిపించడం లేదు.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణించాక అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే, వైకాపా నుంచి టీడీపీలోకి భూమా ఫిరాయించారు. దాంతో ఇప్పుడు తమకే టీడీపీ టిక్కెట్ ఇవ్వాలంటూ భూమా వర్గం పట్టుబడుతోంది. భూమా సోదరుడు శేఖర్ రెడ్డి కుమారుడు బ్రహ్మానంద రెడ్డికి టిక్కెట్ వస్తుందన్న ధీమాతో వారున్నారు. అంతేకాదు… బ్రహ్మానంద రెడ్డి ఏకంగా ప్రచారానికి ప్రజల్లోకి వెళ్లడం మొదలెట్టేశారు. నంద్యాల నియోజక వర్గంలోని కొన్ని గ్రామాలు పర్యటించారు. తన చిన్నాన్నను నమ్ముకున్న కుటుంబాలన్నింటికీ అండగా ఉంటాననీ, టీడీపీ సర్కారు నుంచి రావాల్సిన నిధుల గురించి, అమలు చేయాల్సిన పథకాల గురించి అధ్యయనం చేశానంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. వచ్చే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని బ్రహ్మానంద రెడ్డి చెబుతున్నారు. అంటే, భూమా వారసుడికే టీడీపీ టిక్కెట్ ఖరారు అయిపోయినట్టా..!
మంత్రి భూమా అఖిల ప్రియ సూచనల మేరకే బ్రహ్మానందరెడ్డి ప్రచారం మొదలుపెట్టారని చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా తమ బలాన్ని ప్రదర్శించుకున్నట్టు అవుతుందనీ, ఆ విధంగా పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చి టిక్కెట్టు సాధించుకోవాలన్నది ఆ వర్గం వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో శిల్పా వర్గం కూడా గుర్రుగా ఉందని సమాచారం. టీడీపీ టిక్కెట్టు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా అయినా సరే బరిలోకి దిగడం ఖాయమన్నట్టుగా శిల్పా వర్గం అంటోందట!
మొత్తానికి, నంద్యాల రాజకీయం చంద్రబాబుకు తలనొప్పి పెంచుతోంది. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో గ్రూపు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టీడీపీలో సిగపట్లే తమకు అనుకూలించే అంశం అన్నట్టుగా వైకాపా ఎదురుచూస్తోంది. నంద్యాల ఎన్నిక గురించి ఇంతవరకూ ఆ పార్టీ నోరెత్తిందీ లేదు, అభ్యర్థి ఎవరనే సంకేతాలు ఇచ్చిందీ లేదు.