రాజకీయ నాయకులు మనుషులుగా పతనమవుతున్నారు. చాలా తెలుగు సినిమాల్లో చెప్పినట్టుగా రాజకీయం అనే పులి మీద స్వారీ చేస్తూ మానవత్వాన్ని వదిలేస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచార సమయం నుంచీ ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ రోజు భూమానాగిరెడ్డి సంతాప కార్యక్రమం పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తతంగం అదే. ఇంతకుముందు వరకూ కాంట్రాక్టర్లను, బిజినెస్ పీపుల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ దందాలు చేస్తూ ఉండేవాళ్ళు నాయకులు. కానీ ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం పొలిటీషియన్స్ మెడకే చుట్టుకుంటోంది. ఎవ్వరినీ ఎవరూ నమ్మే పరిస్థితి లేకుండా పోతోంది. ఒక నాయకుడు మృతి చెందిన వెంటనే ఆ నాయకుడికి, ఆ నాయకుడి కుటుంబానికి అండగా నిలవాలన్న స్పృహ కంటే ఆరునెలల్లో ఎధుర్కోబోయే ఉప ఎన్నికల గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు నాయకులు. చనిపోయిన ఎమ్మెల్యే సీటును గెల్చుకోవడం కోసం చేసే ప్రచారానికి ప్రారంభంగా సంతాప తీర్మానాలు, సభలను వాడేస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నంత కాలం భూమానాగిరెడ్డిని అధికార పార్టీవాళ్ళు ఇబ్బంది పెట్టిన మాట నిజం. పార్టీ మారుతున్న సందర్భంలో ఆ విషయాన్ని స్వయానా భూమా నాగిరెడ్డే చెప్పారు. ఇంకా పోరాడే శక్తి తనకు లేదని చెప్పి ఇండైరెక్ట్‌గా చెప్పారు. ఇక ఒక్కసారన్నా మంత్రి పదవిని చేపట్టాలన్న భూమా నాగిరెడ్డి కోరిక గురించి కూడా ఎవరికీ తెలియనిది కాదు. కానీ ఆ కోరిక నెరవేరలేదు. భూమానాగిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబుకు బోలెడన్ని అడ్డంకులు వచ్చాయి. ఎప్పటి నుంచో టిడిపిని నమ్ముకుని ఉన్న భూమా ప్రత్యర్థులతోనే మొదటి సమస్య వచ్చింది. ఆ తర్వాత తలసాని శ్రీనివాసయాదవ్‌ని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు గవర్నర్‌ని చంద్రబాబు నానా రకాలుగా విమర్శించారు. అది కూడా చాలా పెద్ద సమస్య అయి కూర్చుంది. భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఇప్పుడు ఈ నిజాలన్నీ ఒప్పుకునే పరిస్థితిలో చంద్రబాబు లేడు. అలాగే సిచ్యుయేషన్ని రాజకీయంగా ఉపయోగించడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు వైఎస్ జగన్. తనకు బాగా పట్టున్న కర్నూలు జిల్లాలో ఉపఎన్నిక కావడంతో కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం జగన్‌కి ఉంది. అలాగే భూమానాగిరెడ్డిని చంద్రబాబు మానసికంగా హింసించాడు అని చెప్పి ప్రచారం చేసి చంద్రబాబును విలన్‌గా ఎపి ప్రజలకు చూపించాలన్న ప్రయత్నంలో కూడా జగన్ ఉన్నాడు. ఎన్టీఆర్ వెన్నుపోటు విషయంలో అయితేనేమీ, జూనియర్ ఎన్టీఆర్‌తో సహా ఇంకా చాలా మంది విషయంలో వాడుకుని వదిలేస్తాడు అన్న అపవాదు చంద్రబాబుపైన ఎలాగూ ఉంది.ఇప్పుడు ఆ ప్రచారాన్నే ఇంకాస్త బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాడు జగన్.
మొత్తంగా ఈ రోజు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే భూమా నాగిరెడ్డికి సంతాపం తెలపడం పైన కంటే కూడా ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని, అలాగే రాజకీయ మైలేజ్‌ని పొందడంపైనే ఇరు పార్టీల నాయకులూ ఎక్కువ ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. సాటి జంతువు చనిపోతే తోటి జంతువులన్నీ కూడా బాధపడతాయని, మనుషులమైన మనం మాత్రం అలా చేయలేకపోతున్నామని అదే నాయకులు మానవత్వపు కబుర్లు చెప్తున్నారు కానీ అందరూ కూడా రాజకీయ ప్రయోజనం కోసమే పాకులాడారన్నది మాత్రం నిప్పులాంటి నిజం.