శాసనసభ ఎన్నికల ఫలితాలు, హౌలీ వేడుకల్లో మునిగివున్న తెలుగు ప్రజలు రాజకీయ నేతలు భూమా నాగిరెడ్డి మరణవార్తతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆరోగ్యం విషమంగా వుందన్న వార్తల్లోనే తీవ్రత అర్థమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు హెలికాఫ్టర్లో తరలింపు వంటి వార్తలు స్క్రోల్ అవుతుండగానే ఆయన మృతి చెందిన సమాచారం చెప్పాల్సివచ్చింది. కొద్ది కాలం కిందటే ఆయన భార్య మరో ఎంఎల్ఎ ప్రముఖ నాయకురాలు శోభ రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ కలతపర్చింది. ఈ దంపతులు మొదట ప్రజారాజ్యంలో చేరి తర్వాత వైఎస్ఆర్సిపి వైపు వచ్చారు.
శాసనసభలో జగన్ తర్వాత భూమా కూడా ప్రముఖంగా మాట్లాడేవారు.శోభా నాగిరెడ్డి స్థానంలో కుమార్తె అఖిలప్రియ కూడా ఎంఎల్ఎ అయ్యారు. భార్య మరణించాక కొన్నాళ్లకు భూమా టిడిపిలోకి మారారు. ఆ సమయంలో ఆయనను నిలబెట్టుకోవడానికి వైసీపీ చాలా ప్రయత్నాలు చేసినా వ్యక్తిగత కారణాలు స్థానిక పరిస్థితుల వల్ల ఆయన టిడిపిలోకి వెళ్లారు. ఆయన రాక ఇష్టం లేని స్థానిక నేతలు కొందరు వ్యతిరేకత తెల్పినా చంద్రబాబు నాయుడు చేర్చుకున్నారు. భూమా వంటి బలమైన నాయకుడి నిష్క్రమణ వైసీపీ నుంచి ఫిరాయింపులను వేగిరపర్చింది. ఏ పార్టీలో వున్నా ఆయన గట్టి పట్టు నిలబెట్టుకుంటూ వచ్చారు. నంద్యాల ఆళ్లగడ్డ ప్రాంతంలో ప్రభావశీలంగా వుండటమే గాక సామాజిక కోణంలో చాలామందిని ప్రభావితం చేసేవారు. మామ ఎస్విసుబ్బారెడ్డి, బావ ఎస్వి మోహనరెడ్డి కూడా రాజకీయాల్లో వున్నా భూమా పేరే ఎక్కువగా వినిపిస్తుండేది. పాతకాలపు సామాజిక కోణాలు ఆధునిక వ్యాపారాలు రాజకీయాల్లో రకరకాల నిర్ణయాలు తీసుకంటూ తన స్థానాన్ని కాపాడుకున్నారు. ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయమని అంతా భావించారు. ఇంతలోనే హఠాత్తుగా గుండె పోటు రావడం అది మూడవసారి కావడంతో ఆయన బయిటపడలేకపోయారు. చికిత్సకోసం విస్త్రతమైన ఏర్పాట్టు చేసినా వ్యవధిలేకపోవడం, గుండెపోటు తీవ్రంగా రావడం వల్ల కాపాడలేకపోయారు. ఏ దశలోనూ ఆయన చికిత్సకు స్పందించలేదని సమాచారం.భూమా మృతిపట్ల పార్టీలకు అతీతంగా అందరూ విచారం వెలిబుచ్చుతున్నారు. చంద్రబాబు తీవ్ర కలత చెందగా కుటుంబ సభ్యుడిని కోల్పోయామని జగన్ అన్నారు. ఇంకా పలువురు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆళ్లగడ్డలో రేపు అంత్యక్రియలు జరుగుతాయి. ఏమైనా భూమా నాగిరెడ్డి మరణంతో కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒక ఘట్టం ముగిసిపట్టయింది.