ఏ సెంటిమెంట్ ఎఫెక్టో ఏమోగానీ… తెలుగుదేశం పార్టీకి వరుసగా సమస్యలు వచ్చిపడుతున్నాయి. మొన్నటికి మొన్న యూపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి రావడం ఒక సమస్య అయితే… తాజాగా భూమా నాగిరెడ్డి మరణం కూడా పార్టీకి మరో రకమైన సమస్యను తీసుకొచ్చిందని చెప్పాలి. వైకాపా నుంచి గెలిచిన భూమా… కొన్ని కీలక రాజకీయ పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందని ఇప్పుడు కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. ఆయన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే, తెలుగుదేశం పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదన్న ఆవేదన ఆయన్ని ఎంతగానో బాధించేదంటూ.. పరోక్షంగా భూమా రాజకీయ ప్రస్థానాన్ని గందరగోళంలోకి నెట్టింది తెలుగుదేశమే అంటూ కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు.. భూమాకి శాసనసభలో సంతాపం తెలుపుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగంపై కూడా విమర్శలు మొదలయ్యాయి. సంతాప సమయంలో కూడా స్వోత్కర్షకుపోతూ… రాయలసీమలో ఫ్యాక్షన్ తానే అరికట్టాననీ, అక్కడి ప్రజల్ని తానే ఉద్ధించడానికి పూనుకున్నాను అన్నట్టుగా మాట్లాడేశారు. సభ జరుగుతున్న సందర్భమేంటీ, ఆయన మాట్లాడుతున్న తీరేంటనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఇమేజ్ డామేజ్ను తెలుగుదేశం గుర్తించినట్టుగానే ఉందని చెప్పాలి.
ఇంకోపక్క, పార్టీలో భూమాకి సరైన గుర్తింపు లభించలేదన్న అభిప్రాయం… మొత్తంగా వైకాపా ఫిరాయింపు ఎమ్మెల్యేలందరిపైనా ఉంటుందని అనడంలో సందేహం లేదు. పైగా, మంత్రి పదవి ఇస్తామని కొందర్నీ… ఇతర ప్రయోజనాలేవో చేకూరుస్తామని ఇంకొందర్నీ టీడీపీలోకి ఆకర్షించారు. కానీ, అలా ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలు చేయలేకపోయారు. ఈ క్రమంలోనే భూమాపై ఒత్తిడి పెరిగిందనీ అంటున్నారు. ఓ రకంగా భూమా అనారోగ్య పరిస్థితికి పార్టీ నుంచి పెరిగిన ఒత్తిడీ ఓ కారణంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని వెంటనే ఆపాల్సిన అత్యవసర పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది కదా! లేదంటే, టీడీపీ అనుసరించిన ఫిరాయింపు రాజకీయాలే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందనేది చంద్రబాబుకు తెలుసు కదా!
సో… ఈ నేపథ్యంలో కిం కర్తవ్యం ఏంటీ..? విపక్షంపై విమర్శలు చేయడం. అంతే, అన్నిటికీ ఇదే తారక మంత్రం. భూమా సంతాప తీర్మాన సమయంలో సభను వైకాపా బహిష్కరించింది. ఇదే పాయింట్‌ను పట్టుకుని టీడీపీ విమర్శలు మొదలుపెట్టింది. ఒక ఎమ్మెల్యే మరణిస్తే, ఆ సంతాప సభలో పాల్గొనని విపక్ష పార్టీని తన కెరీర్లోనే ఎక్కడా చూడలేదంటూ విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు. జగన్ లాంటి నాయకులు మన సమాజానికి అవసరమా అంటూ ప్రశ్నించారు. నిన్నమొన్నటి వరకూ భూమా వైకాపాలో ఉన్నా కూడా ఇలా వ్యవహరించడం ఏంటని విమర్శించారు. తెలుగుదేశం లక్ష్యం ఏంటో ఈ విమర్శలే చెబుతున్నాయి! సంతాప తీర్మానాన్ని అడ్డం పెట్టుకుని… అసలు విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తీకరిస్తున్నారు.