హైదరాబాద్: కర్నూలుజిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవ వైసీపీ పార్టీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టుకు దారితీసింది. నాగిరెడ్డి కుమార్తె, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ఎన్నికల సందర్భంగా ఇవాళ నంద్యాలలో పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళినపుడు ఆమెకు, పోలీసు అధికారులకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది తెలుసుకున్న భూమా అక్కడకు చేరుకుని ఆ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసు అధికారులను దూషించటం తదితర అభియోగాలతో భూమాపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. డీఎస్పీ దేవదానాన్ని తనను తాకొద్దని అన్నారని ఆరోపిస్తూ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుకూడా నమోదు చేశారు. మరోవైపు ఈ సాయంత్రం భూమాను అరెస్ట్ చేయటానికి ఆయన ఇంటికి వెళ్ళినపుడు వైసీపీ కార్యకర్తలు, భూమా అనుచరులు పోలీసులను అడ్డుకోవటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలను నెట్టేసి పోలీసులు భూమాను తీసుకెళ్ళారు.