టీటీడీ మాజీ చైర్మన్, జగన్ రెడ్డి ఆత్మబంధువుల్లో ఒకరు అయిన భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు పరువు కోసం టీడీపీని బెదిరిస్తున్నారు. మేము వచ్చాక మీ సంగతి చూస్తామని హెచ్చరిస్తున్నారు. వాయిస్ లో ఏ మాత్రం బేస్ లేకుండా చర్చిల్లో ప్రార్థనలు చేసినట్లుగా మాట్లాడే భూమన కరుణాకర్ రెడ్డి .. అదే వాయిస్ లో టీడీపీకి బెదిరింపులు ఇవ్వడం కాస్త కామెడీగా ఉంటోంది.
అసలు విషయం ఏమిటంటే.. కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. జనసేన అభ్యర్థి చేతిలో అరవై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తిరుపతి కార్పొరేషన్ లో రెండో డిప్యూటీ మేయర్ గా ఉన్న తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ పదవికి ఉపఎన్నిక వచ్చింది. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి అన్ని రకాల అరాచకాలు చేసి ఒక్కటి తప్ప అన్ని కార్పొరేటర్ సీట్లు గెల్చుకున్నారు. టీడీపీకి ఒక్క కార్పొరేటర్ మాత్రమే ఉన్నారు.
ఇలాంటి సమయంలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక వైసీపీకి ఏకగ్రీవం కావాలి. కానీ ప్రభుత్వం మారిన తరవాత కార్పొరేటర్లు అంతా కూటమికి క్యూ కట్టారు. ఇప్పుడు వైసీపీకి మెజార్టీ ఉందో లేదో కూడా తెలియదు. శేఖర్ రెడ్డి అనే కార్పొరేటర్ ను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నిలబెట్టారు.కానీ ఆయన టీడీపీలో చేరిపోవడానికి రెడీ అయ్యారు. దాంతో వేరే అభ్యర్థిని పెట్టారు. ఆయనైనా ఉంటాడో లేదో తెలియదు. తమ అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారని అందుకే టీడీపీలో చేరుతున్నారని భూమన అంటున్నారు.
డిప్యూటీ మేయర్ పదవిని వైసీపీ గెల్చుకోలేకపోతే మేయర్ పదవి కూడా ఊడిపోతుంది. కౌన్సిల్ లో మెజార్టీ పోయినట్లు అవుతుంది. అందుకే భూమన కంగారు పడుతున్నారు.