తిరుపతి రెండో డిప్యూటీ మేయర్ పోస్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి గెలవకుండా చేయాలని అనుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డికి కాలం కలసి రాలేదు. తన కార్పొరేటర్లు.. చివరికి ఎక్స్ అఫిషియో మెంబర్ అయిన సిపాయి సుబ్రహ్మణ్యం కూడా హ్యాండివ్వడంతో పరువు పోయింది. తన కుమారుడు అభినయ్ రెడ్డి రాజీనామా చేసిన డిప్యూటీ మేయర్ సీటులోకి టీడీపీ కార్పొరేటర్ మినికృష్ణ వచ్చి కూర్చున్నారు.
ఎస్వీ యుూనివర్శిటీలో జరిగిన ఓటింగ్ లో వైసీపీ తరపున ఇరవై రెండు మంది సభ్యులు హాజరయ్యారు. అందులోనూ ఇరవై ఒక్క మంది మాత్రమే ఓటు వేశారు. మరొకరు టీడీపీ వైపు వెళ్లిపోయారు. మొత్తంగా టీడీపీ డిప్యూటీ మేయర్ కు ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి. దీంతో ఐదు ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్ అయ్యారు. ఇప్పటికే మేయర్ తో పాటు మొదటి డిప్యూటీ మేయర్ కూడా వైసీపీకి చెందినవారు ఉన్నారు. రెండో డిప్యూటీ మేయర్ ను గెల్చుకుంటే కార్పొరేషన్ తమ చేతుల్లోనే ఉంటుందని భూమన అనుకున్నారు.
కానీ ఇప్పుడు రెండో డిప్యూటీ మేయర్ గా టీడీపీ సభ్యుడు గెలవడం వల్ల ఇక కార్పొరేషన్ లో టీడీపీ పెత్తనం ఉంటుంది. మేయర్, మొదటి డిప్యూటీ మేయర్ ను అధికారులు పట్టించుకునే అవకాశాలు ఉండవు. అంటే తిరుపతి కార్పొరేషన్ లో భూమన పట్టు పోయినట్లే. జిల్లా అధ్యక్ష పదవి తీసుకుని సొంత సెగ్మెంట్ లో పూర్తి బలం ఉన్నా.. డిప్యూటీ మేయర్ ను గెలిపించలేకపోవడం భూమనకు పెద్ద దెబ్బే.