రమణదీక్షితులకు మద్దతు లభించాల్సిన చోట అనూహ్యంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన అన్నీ అబద్దాలు చెబుతున్నారంటూ.. ఆరోపణలు వినిపిస్తున్నాయి. రమణదీక్షితులు ఆమరణదీక్ష అంటూ చేస్తే లక్షల మందితో అడ్డుకుంటామని హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ చేసింది ఎవరో కాదు.. వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు..భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి. భూమన్ అనే పేరుతో రచయితగా పేరు తెచ్చుకున్న భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి రాయలసీమ అధ్యయనాల వేదిక అనే సంస్థను నడుపుతున్నారు. భూమన్… తన సోదరుడు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు… టీటీడీకే చెందిన శ్వేత సంస్థకు డైరక్టర్ గా వ్యవహరించారు. ఈ భూమన్ ఇప్పుడు …సినీ నిర్మాత, మాజీ పీఆర్పీ నేత ఎన్వీ ప్రసాద్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రమణదీక్షితులు తీరుపై మండిపడ్డారు. శ్రీవారి నగలు ఏమీ అదృశ్యం అవలేదని ఎన్నో కమిటీలు తేల్చాయన్న సంగతిని వీరిద్దరూ గుర్తు చేశారు.
కేవలం రాజకీయ, వ్యక్తిగత కారణాలతోనే… రమణదీక్షితులు టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ విచారణ కోసం.. ఆమరణ దీక్ష చేస్తానన్న రమణదీక్షితులు ప్రకటనపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆమరణదీక్ష చేస్తే… లక్షల మందితో అడ్డుకుంటామన్నారు. రమణదీక్షితులకు వ్యతిరేకంగా భూమన్, ఎన్వీ ప్రసాద్ తెరమీదకు రావడం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తే… ముందుగా భూమన కరుణాకర్ రెడ్డిని విచారించాల్సి వస్తుంది. ఎందుకంటే.. పింక్ రూబీ పలిగింది ఆయన హయాంలోనే. ఇక నగలు అదృశ్యమయ్యాయని చేస్తున్న ఆరోపణలు కూడా.. భూమన హయాంలో వచ్చినవే. రమణదీక్షితులు ఆమరణ దీక్ష చేస్తే..విచారణకు ఆదేశించాల్సి వస్తే.. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని భూమన వర్గీయులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వివాదం ప్రారంభమైన చాలా రోజుల తర్వాత రాయలసీమ అధ్యయనాల వేదిక పేరుతో వీరిద్దరూ తెర మీదకు వచ్చారు.
రమణదీక్షితులు టీటీడీపై తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు.. వీరు సైలెంట్ గా ఉన్నారు. కానీ మెల్లగా వ్యవహారం తమ మీదకు వస్తూండేసరికి.. మీడియా ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు. భూమన్, ఎన్వీ ప్రసాద్ .. రమణదీక్షితులుకు వ్యతిరేకంగా గళమెత్తడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకున్నట్లే భావించవచ్చు. దీక్షితులుకు వైసీపీ నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. అనూహ్యంగా భూమన వర్గం మాత్రం ఇప్పుడు వ్యతిరేకించడం ప్రారంభించింది. ఇప్పటికే క్రిస్టియన్ మైనార్టీ సంస్థల ప్రతినిధులతో కలిసి…రమణదీక్షితులు టీటీడీపై పోరాటం చేస్తానని చెప్పడం కలకలం రేపుతోంది. ఇప్పుడు తిరుపతిలో రమణదీక్షితులకు వ్యతిరేకంగా వచ్చిన ప్రకటనలు ఈ వివాదాన్ని మరో కోణంలో ఆవిష్కరించే అవకాశం ఉంది.