కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు దిశగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీకి కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ ఫోన్ చేశారు. తనను ఢిల్లీలో కలిసిన టీడీపీ ఎంపీలతో ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని అంశాలూ చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. కాబట్టి వెంటనే దీక్ష విరమించాలని ఆయన కోరారు. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వస్తే తప్ప తాను దీక్షను విరమించే పరిస్థితి లేదని సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించేందుకు సిద్దంగా ఉందని సీఎం రమేష్ మరోసారి కేంద్రమంత్రికి చెప్పారు.
కడప చాలా వెనకబడిన ప్రాంతమనీ, ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సెంటిమెంట్ గా మారిందనీ, కాబట్టి వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని రమేష్ కోరారు. ఈ విషయంలో రాజకీయ కోణాలు చూడొద్దనీ, కడపలో ప్లాంట్ ఏర్పాటు చేస్తే క్రెడిట్ అంతా భాజపాకే దక్కుతుందనీ, తమకు క్రెడిట్ అవసరం లేదనీ, ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పి ఒప్పించాలంటూ బీరేంద్ర ను రమేష్ కోరారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు కలుసుకున్న సందర్బంగా సీఎం రమేష్ కు కేంద్రమంత్రి ఫోన్ ఫోన్ చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ అంశమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను కేంద్రమంత్రికి ఎంపీలు అందజేశారు. దీనిపై స్పందిస్తూ… అధికారులతో సంప్రదింపులు జరిగిన తరువాతే స్పష్టత ఇస్తామనీ, ప్రభుత్వ ఫార్మాట్ లో మెకాన్ సంస్థకు వెంటనే సమాచారం ఇవ్వాలని టీడీపీ ఎంపీలను కోరానని బీరేంద్ర సింగ్ ఢిల్లీలో మీడియాతో చెప్పారు. అయితే, ఇప్పటికే మెకాన్ కు ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చామని ఎపీఎండీసీ ఛైర్మన్ చెబుతున్నారు.
కడప ఉక్కు కర్మాగారం విషయమై కేంద్రం నుంచి వస్తున్న స్పందనలో స్పష్టత లేదు. ఏర్పాటుకు అనుగుణంగా సంప్రదింపులు కొనసాగిస్తామని చెబుతున్నారే తప్ప, అవి ఎన్నాళ్లకి పూర్తవుతాయీ, స్పష్టమైన ప్రకటన ఎప్పుడు ఇస్తారనేది మాత్రం కేంద్రమంత్రి చెప్పడం లేదు. తాత్కాలికంగా సీఎం రమేష్ తో దీక్ష విరమింపజేస్తే చాలు అన్నట్టుగానే బీరేంద్ర ఫోన్ లో మాట్లాడారు. అయితే, కేంద్రం నుంచి అధికారికంగా ఏదో ఒక ప్రకటన వెలువడితే తప్ప దీక్ష విరమించేది లేదని సీఎం రమేష్ కూడా పట్టుదలతో ఉన్నారు. దీంతో కేంద్ర వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందేమో చూడాలి.