BhuvanaVijayam Movie Review
కేవలం కామెడీ కోసమే సినిమాలు చూసే రోజులు పోయాయి. ఎందుకంటే… కాసేపు నవ్వుకోవడానికైతే జబర్దస్త్ లాంటి చాలా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. పైగా నవ్వించడం చాలా కష్టం. అందుకే… నరేష్ లాంటి కామెడీ హీరోలు కూడా.. సీరియస్ కథల్ని ఎంచుకొంటున్నారు. దాంతో కామెడీ సినిమాలు కనుమరుగైపోతున్నాయి. అలాంటి దశలో… ‘భువన విజయం’ అనే ఓ సినిమా వచ్చింది. సునీల్, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్… ఇలా కామెడీ గ్యాంగ్ అంతా కలిసి చేసిన సినిమా ఇది. టైటిల్ ఆసక్తికరంగా ఉంది. మరి సినిమా ఎలా ఉంది? కామెడీ జోనర్లో సినిమాలు రాని లోటుని భువన విజయం తీర్చిందా? లేదా?
కథలోకి వెళ్దాం.. చలపతి (గోపరాజు రమణ) ఓ నిర్మాత. తన సినిమా కోసం కొత్త సినిమా ‘కథ’లు వింటుండగా, ఒక రోజు ప్రసాద్(శ్రీనివాస్ రెడ్డి), రేఖా రాణి(సోనియా చౌదరి), సాంబ మూర్తి(పృథ్వి), గంగులు(వైవా హర్ష) ఇలా ఏడుగురు కథలు వినిపిస్తారు. ఆ ఏడూ… చలపతికి నచ్చుతాయి. ఆ ఏడుగురినీ ఓ రూమ్‌లోకి పంపిస్తాడు. `మీరంతా కలిసి ఓ కథని సెలెక్ట్ చేయండి.. అలా ఎంపిక చేసిన కథకు పది లక్షలు అడ్వాన్స్ ఇస్తా` అంటాడు. ఈ ఏడుగురికీ పది లక్షలు సొంతం చేసుకోవాలన్న.. ఆశ కలుగుతుంది. తమ కథే గొప్ప అంటూ.. ఒకరిపై ఒకరు వాదానికి దిగుతారు. ఈ క్రమంలో… ఈ ఏడుగురిలో ఒకరు చనిపోతారు. చనిపోయింది ఎవరు? దానికి కారణం ఎవరు? చివరికి ఎవరి కథ ఓకే అయ్యింది? ఆ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనేదే మిగిలిన కథ.
ప్రపంచంలో ప్రతి మనిషి గుర్తింపు కోరుకుంటాడు. అ గుర్తింపు గెలుపుతోనే వస్తుంది. ప్రతి మనిషి గెలుపు కోసమే పరిగెడతాడు. అయితే భువన విజయం ఓడి గెలిచినవాడి కథ. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని గెలిపించిన కథ. అదే ఈ భువన విజయం. కథని మొదలెట్టిన విధానం బాగుంది. సరదాగా, నవ్విస్తూ అసలు కథలోకి తీసుకెళ్లారు. ఏడుగురూ ఏడు కథలు వినిపించిన తీరు.. అక్కడ పుట్టించిన కామెడీ ఓకే అనిపిస్తుంది. మరీ పగలబడి నవ్వుకొనే సీన్లు లేవు కానీ.. టైమ్ పాస్ అయిపోతుంది. ఆ ఏడుగురిలో ఎవరి కథ ఓకే అవుతుంది? నిజానికి ఆయా కథల వెనుక సీక్రెట్ ఏమైనా ఉందా? అనే ఉత్సుకత.. ప్రేక్షకుల్లో కలుగుతుంది. తమ కథే ఫైనల్ అవ్వాలి… అనే పోటీతత్వం నచ్చుతుంది.
అయితే ఇది పూర్తిగా కామెడీ కథ కాదు. ఇందులో ఎమోషన్ జోడించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అది కొంత వరకూ వర్కవుట్ అయినా.. పూర్తి స్థాయిలో పండలేదు. కాస్త కామెడీ.. కాస్త ఎమోషన్ అంటూ సీన్లని పంచుకొంటూ వెళ్లిన దర్శకుడు దేనికీ న్యాయం చేయలేకపోయాడనిపిస్తుంది. కొన్ని సీన్లు పైపైన తేలిపోయాయి. తెరపై ఇంతమంది కమెడియన్లు ఉన్నప్పుడు వాళ్లందరికీ న్యాయం చేసేలా సీన్లు రాసుకోవడం కష్టం. ఒకరు విజృంభిస్తుంటే, ఇంకొకరు సైలెంట్ అయిపోతారు. ఇక్కడా అదే జరిగింది. ఏ పాత్రనీ పూర్తి స్థాయిలో చూసే అవకాశం రాలేదు. ఓ దొంగ ఎన్నడూ లేని విధంగా ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి మాములు మనిషి గా ఎలా మారాడు? ఆఖరికి దేవుడు కూడా ఎమోషన్స్ కి ఎలా కరిగాడు? తెర మీద చూపించిన తీరు బాగుంది. క్లైమాక్స్ కూడా అర్థవంతంగా లేదు. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి వదిలారు. బహుశా.. రెండో భాగంలో ఈ కథని ముగిస్తారేమో..?
ధనరాజ్, రమణ గోపరాజ్ ఇద్దరూ ఈ కథని మోయడంలో కీలక పాత్ర పోషించారు. నాటకాల నుంచి వచ్చిన రమణ… తన అనుభవాన్ని వెండి తెరపై మరోసారి చూపించారు. సునీల్ కి ఇది కొత్త పాత్ర కాదు. కానీ… తన పాత్రలో రకరకాల షేడ్స్ కనిపిస్తాయి. వెన్నెల కిషోర్ స్క్రీన్ మీద కనిపించింది కాసేపే అయినా.. నవ్వించాడు. శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష, పృథ్వి తమ పాత్రలలో చక్కగా ఓదిగిపొయ్యారు.
ఏడుగురు రచయితల చుట్టూ కథని నడిపి, వాళ్లతో వినోదాన్ని, ఎమోషన్‌నీ పండించాలన్నది దర్శకుడి ప్రయత్నం. ఆలోచన బాగుంది. కాకపోతే.. దాన్ని ఆచరణలో పెట్టిన విధానంలోనే దర్శకుడి అనుభవలేమి కనిపించింది. తెర నిండా ఆర్టిస్టులు ఉన్నా.. వాళ్లని సక్రమంగా వాడుకోలేదు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుందన్న వైనాన.. కామెడీ కూడా పలచపడింది. ఈ సినిమాని పూర్తి స్థాయి వినోద భరిత చిత్రంగా తీర్చిదిద్ద వచ్చు. ఈ కథకు ఆ స్కోప్ ఉంది. అప్పుడైతే లాజిక్కులు సైతం మర్చిపోయేవారు. కానీ అలా జరగలేదు. పాటలు ఆకట్టుకోవవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించదు. నిర్మాణ విలువల్లో బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి.