అమరావతి రైతుల కుటుంబాల్లో మహిళలు పోరాడుతున్న విధానం చూసి… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి కలత చెందారు. ఉద్యమానికి విరాళంగా.. అప్పటికప్పుడు.. ఆమె తన చేతి గాజుల్ని తీసి ఇచ్చేశారు. రైతుల పోరాటానికి మద్దతుగా.. చంద్రబాబు నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకోకుండా… రాజధాని గ్రామల్లో రైతులకు సంఘిభావం తెలిపేందుకు వెళ్లారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. మొదట ఎర్రబాలెం గ్రామంలో రైతులు చేపట్టిన దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు రాష్ట్రం కోసం పడిన కష్టాన్ని భువనేశ్వరి రైతులకు వివరించారు.
ఆంధ్రను మొదటి స్థానంలో ఉంచడానికి చంద్రబాబు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డారని గుర్తు చేసుకున్నారు. అన్నం తింటున్నా.. నిద్రలోనూ.. ఎప్పుడూ అమరావతి, పోలవరం అని చంద్రబాబు తపించారన్నారు. ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసమే కష్టపడ్డారని.. రైతులకు పూర్తి మద్దతుగా తమ కుటుంబం ఉంటుందని.. భువనేశ్వరి భరోసా ఇచ్చారు. రైతుల భూముల ధరలు పెరిగితే.. కడుపు మంట ఎందుకని జగన్ను చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిపై ఎన్ని రకాల నిందలు వేయాలో.. అన్నీ వేశారని.. చివరకు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారని మండిపడ్డారు. తనలా అందరూ దొంగ లెక్కలు రాస్తారని అనుకుంటున్నారని మండిపడ్డారు. రాజధానిని కాపాడే బాధ్యత యువత, రైతులు, మహిళలపై ఉంది. అందరూ కలిసి పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే.. అక్కడ ఒక్క కులం వారు.. ఒక్క మతం వారు.. ఒక్క ప్రాంతం వారు ఉపాధి పొందడం లేదని.. అన్ని మతాలు..కులాలు.. ప్రాంతాల వారు ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. అమరావతి అభివృద్ధి చెందిన.. ఆంధ్రులందరికీ ఉపాధినిస్తుందన్నారు. నూతన సంవత్సర వేడుకలకు టీడీపీ నేతలందరూ దూరంగా ఉన్నారు. అమరావతి ఉద్యమానికి తమ వంతు విరాళం ఇచ్చారు.