డబ్బింగ్ సినిమాల్లో చివరి సంచలనం.. ‘బిచ్చగాడు’. రూ.50 లక్షలు పెట్టి ఈ సినిమా కొంటే.. తెలుగు రాష్ట్రాలలో రూ.10 కోట్ల వరకూ వసూలు సాధించింది. ఈ స్థాయిలో నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టిన డబ్బింగ్ సినిమా, ఈమధ్య కాలంలో మరోటి లేదు. విజయ్ ఆంటోనీని తెలుగులో క్రేజ్ సంపాదించిన సినిమా అది. దురదృష్టం ఏమిటంటే… ఆ తరవాత.. అలాంటి హిట్టు విజయ్ ఆంటోనీ ఖాతాలోనూ లేదు. ఇప్పుడు మరో బిచ్చగాడిని పరిచయం చేస్తున్నాడు విజయ్ ఆంటోనీ.
బిచ్చగాడు కథకు సీక్వెల్ రాబోతోందిప్పుడు. బిచ్చగాడు కథ ఎక్కడైతే ఆగిందో, అక్కడి నుంచి ఈ కథ మొదలు కానుంది. అమ్మ సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా ఉండబోతోందని టాక్. ఈనెల 24న విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు. ఆ రోజున బిచ్చగాడు 2 సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. మరి బిచ్చగాడు విజయ్‌కి మరో విజయాన్ని అందిస్తుందా? లేదంటే అన్ని సీక్వెల్స్ లానే పల్టీలు కొడుతుందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.