నల్లధనాన్నంతా వెనక్కి తెస్తాం.. ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షలేస్తాం అని బీజేపీ చెప్పింది కానీ.. ఇప్పటి వరకూ వేసింది లేదు.. కానీ నల్లధనం మొత్తం వెనక్కి తెచ్చామని కూడా చెప్పారు. దీంతో ప్రజలకు ఆశల్లేవు. కరోనా సమయంలో ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ అని చెప్పారు కానీ.. అందులో ఎవరికైనా సాయం అందిందని అనుకోలేని పరిస్థితి. ఆ పేరుతో పెట్రోల్ రేట్లు మాత్రం లీటర్కు రూ. పదిహేను చొప్పున పెంచేశారు. కానీ అమెరికాలో పరిస్థితి అలా లేదు. బ్లాక్ మనీ గురించి ఎన్నికల్లో ప్రచారం చేయకుండానే… నగదు బదిలీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా… అమెరికా అధ్యక్షుడు జో బిడెన్… పదవి చేపట్టగానే.. ప్రజలందర్నీ ఆదుకోవడానికి ఓ సంచలన ప్యాకేజీకి ఆమోదం తెలిపారు.
దాని ప్రకారం.. ప్రతి అమెరికా పౌరుడి అకౌంట్కు రెండు వేల డాలర్లు జమ అవుతాయి. అంటే.. మన రూపాయల్లో లక్షన్నర అన్నమాట. అమెరికా రెస్క్యూ ప్లాన్ పేరుతో లక్షా 90వేల కోట్ల డాలర్ల ప్యాకేజీని బైడెన్ ప్రకటించారు. ఆర్థికంగా కుంగిపోయిన ఇతర రంగాలకు పెద్ద ఎత్తున ప్యాకేజీలు ప్రకటించనున్నారు. నిజానికి గతంలో ట్రంప్ కూడా ఇలాంటి భారీ ప్యాకేజీని ఓ సారి ప్రకటించారు. రూ.66లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించి.. ప్రజలకు పంపిణీ చేశారు.
అమెరికాలో ప్యాకేజీ అంటే నేరుగా నగదు బదిలీనే. ఇప్పటి వరకూ అమలు చేస్తున్న వాటికి ప్యాకేజీ పేరు పెట్టరు. కొత్తగా చేసే సాయన్నే ప్రకటిస్తారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి.. వ్యాపారాల్లో నష్టపోయిన వారికీ.. ఇలా అందరికీ .. ఉద్దీపన ప్రయోజనాలను బ్యాంకు అకౌంట్ల ద్వారా అందించారు. ఆ సాయానికి అదనంగా జో బిడెన్ అందించబోతున్నారు. దీంతో అమెరికన్ ప్రజలకు .. అక్కడి ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది.