యూపియే హయంలో రాష్ట్ర విభజన సమస్యని పరిష్కరించకుండా దాదాపు 10 ఏళ్ళు సాగదీసినందుకు అనేక లక్షల కోట్ల నష్టం ఏర్పడింది. అనేక వందల మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర విభజన చేయాలని నిర్ణయం తీసుకొన్న తరువాత చాలా హడావుడిగా కేవలం 6 నెలలలోనే రాష్ట్రాన్ని రెండుగా విభజించేసి చేతులు దులుపుకొంది. తత్ఫలితంగా నేటికీ రెండు తెలుగు రాష్ట్రాలు ఏదో ఒక సమస్యపై కీచులాడుకొంటూనే ఉన్నాయి. వాటిలో హైకోర్టు విభజన కూడా ఒకటి. ఆంధ్రాతో కలిసుండలేమని, దాని పాలకుల వలన తెలంగాణాకి చాలా అన్యాయం జరుగుతోందనే కారణంతోనే రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు, మళ్ళీ రెండు రాష్ట్రాలకి ఉమ్మడిగా రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయడం ఎంత అవివేకమో విభజన చేసిన కాంగ్రెస్ మేధావులకి తెలుసుకోలేకపోయారు. కానీ వారి తప్పుడు నిర్ణయాల కారణంగా ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు, ఉద్యోగులు, ప్రజలు అందరూ నేటికీ అనవసరంగా ఘర్షణ పడవలసి వస్తోంది.
గత రెండేళ్ళ నుంచి ఉమ్మడి హైకోర్టు విభజన చేయాలని తెలంగాణా ప్రభుత్వం, న్యాయవాదులు కోరుతూనే ఉన్నారు. కానీ విభజన చట్టంలో యూపియే ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన నేటికీ అది సాధ్యపడటం లేదు. తెదేపా, భాజపాలు మిత్రపక్షాలుగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నందునో ఏమో మోడీ ప్రభుత్వం కూడా ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించడం లేదు.
ఒక సమస్య ఉందని గుర్తించినపుడు, దానిని వెంటనే పరిష్కరించకుండా నాన్చితే ఏమవుతుందో కళ్ళారా చూసిన తరువాత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై నిర్లిప్త వైఖరి వీడటం లేదు. తత్ఫలితంగా గత వారం రోజులుగా తెలంగాణా న్యాయవాదులు సమ్మె చేస్తున్నారు. అనేక జిల్లాలలో న్యాయస్థానాలు మూతపడ్డాయి. వారి సమ్మెకు సహేతుకమైన కారణాలే కనిపిస్తున్నాయి.
గత నెల 5న ఆంధ్రా,తెలంగాణా రాష్ట్రాలలో దిగువ కోర్టులకి సిబ్బంది నియామకాలు జరిగాయి. వాటిలో తెలంగాణాకి కేటాయించిన 335 మందిలో 130 మంది ఆంధ్రాకి చెందినవారున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా తెలంగాణా కోర్టులలో ఆంధ్రా సిబ్బందిని, ఆంధ్రా న్యాయవాదులని నియమించడాన్ని వారు నిరసిస్తూ సమ్మె చేస్తున్నారు. సోమవారం “చలో హైకోర్టు’ పేరిట హైకోర్టుని ముట్టడించేందుకు ప్రయత్నించారు కానీ పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఈ సమస్య గురించి న్యాయవాదులు ఇంత గట్టిగా ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నాకూడా పోలీసులతో వారిని అడ్డుకోనంత మాత్రాన్న ఈ సమస్య పరిష్కారం అవదని, మున్ముందు అది ఇంకా జటిలమవుతుందని కూడా అందరికీ తెలుసు. తెలిసి కూడా నిర్లిప్తత వహించడాన్ని ఏమనుకోవాలి?
కారణాలు ఏవైతేనేమి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసి యుద్దప్రాతిపదికన తాత్కాలిక సచివాలయం నిర్మించుకొంటోంది. అందులోనే శాసనసభ, విధాన మండలి, ముఖ్యమంత్రి కార్యాలయం, అన్ని ప్రభుత్వ కమీషనరేట్స్ ఏర్పాటు చేసుకొంటున్న సంగతి తెలిసిందే. అటువంటప్పుడు హైకోర్టు కోసం కూడా మరో తాత్కాలిక భవనం ఎందుకు నిర్మించుకోవడం లేదు? లేదా తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్రంలో ఎక్కడా సరిపడే భవనాలే లేవా?
శంఖుస్థాపనలకి, యాగాలకి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ భేషజాలు, రాజకీయ విభేదాలు, అన్నిటినీ పక్కనబెట్టి మాట్లాడుకొంటారు. ఒకరినొకరు ఆహ్వానించుకొంటారు. ఒకరి కార్యక్రమాలకి మరొకరు హాజరవుతుంటారు. కానీ ఇరు రాష్ట్రాల ప్రజలకి కూడా చాలా ఇబ్బందికరంగా మారిన ఉమ్మడి హైకోర్టు విభజన సమస్య గురించి మాత్రం మాట్లాడుకోరు..ఎందుకు? సమస్యలని పరిష్కరించే తెలివితేటలూ, అధికారం, అవకాశం అన్నీ ఉన్నా కూడా సమస్యని నాన్చుతూ కోతి పుండు బ్రహ్మ రాక్షసి అన్నట్లుగా తయారు చేసుకోవడం ఎందుకు? తమ ప్రజల కోసం తమ బేషజాలు,అహం, రాజకీయ కక్షలని పక్కనపెట్టలేరా? ఇద్దరు ముఖ్యమంత్రులు ఆలోచిస్తే బాగుంటుంది. ప్రజలు కూడా హర్షిస్తారు.