జబర్దస్త్ తో పాపులర్ అయిన కమెడియన్.. సుడిగాలి సుధీర్. తను ఓ యూ ట్యూబ్ స్టార్. అయితే సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. చిన్నా చితకా పాత్రల నుంచి హీరో స్థాయికి ఎదిగాడు. సుధీర్ హీరోగా చేసిన `గాలోడు` కమర్షియల్ గా అనూహ్య విజయాన్ని అందుకొంది. ఈ సినిమాకి రూపాయి పెడితే.. మరో రూపాయి లాభంగా వచ్చింది. అందుకే సుధీర్ పై చిన్న నిర్మాతల దృష్టి పడింది. సుడిగాలి సుధీర్ హీరోగా `గోట్` అనే ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమా బడ్జెట్ రూ.9 కోట్లు. విశ్వక్సేన్తో పాగల్ సినిమా తీసిన నరేష్ ఈ చిత్రానికి దర్శకుడు. ముందు రూ.5 కోట్లలో సినిమా పూర్తి చేద్దామని బరిలోకి దిగారు. అయితే తీరా.. ఇప్పుడు రూ.9 కోట్లు అవుతోంది. పబ్లిసిటీతో కలుపుకొంటే మొత్తం 10 కోట్లు లెక్క తేలొచ్చు. సుధీర్‌గా ఇంత పెట్టుబడి పెట్టడం రిస్కే. కానీ.. గాలోడు సినిమాలా `గోట్` కూడా బాక్సాఫీసు దగ్గర నిలబడిపోతుందని, రూపాయికి రూపాయి మిగులుతుందని నిర్మాతలు ఆశలు పెట్టుకొన్నారు. ఈ టాస్క్ కూడా సుధీర్ దాటేస్తే… సుధీర్ పంట పండినట్టే.