సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి సర్కార్ కు భారీ ఎదురుదెబ్బ తగలింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించి విద్యుత్ కొనుగోళ్ల అంశంలో అవకతవకలపై ఏర్పాటైన పవర్ కమిషన్ జడ్జిని తప్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ స్పష్టం చేశారు.
కమిషన్ లో ఉన్న జడ్జి విచారణకు ముందే ఎలా ప్రెస్మీట్ పెడతారు…? కొత్త జడ్జిని నియమించండి అని సుప్రీం చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. దీంతో కొత్త జడ్జిని పెట్టేందుకు తెలంగాణ సర్కార్ సుముఖత వ్యక్తం చేసింది.
పవర్ కమిషన్ ను రద్దు చేయాలి… విచారణకు ముందే న్యాయమూర్తి ప్రెస్మీట్ ఎలా పెడతారంటూ పవర్ కమిషన్ పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టులో సవాల్ చేయగా… కేసీఆర్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.
కొత్త జడ్జిగా ఎవరిని నియమిస్తారో లంచ్ తర్వాత చెప్పాలంటూ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న అంశంపై విచారించేందుకు రిటైర్డ్ జడ్జితో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అసలు ఈ కమిషన్ నియామకాన్నే ముకుల్ రోహత్గీ తప్పుపట్టారు. ఎన్నో ట్రిబ్యునల్స్ ఉన్నా ప్రత్యేకంగా కమిషన్ ఎందుకు వేయాల్సి వచ్చింది, విభజన తర్వాత ప్రజల కోసం విద్యుత్ కొనుగోలు చేశామని… పైగా, మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకే విద్యుత్ కొన్నామని ఆయన వాదించారు.