అల్లరి నరేష్ హీరో అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? సాక్ష్యాత్తూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఈ విషయాన్ని ఓ సందర్భంలో అల్లరి నరేష్ స్వయంగా చెప్పాడు. ఆ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే..
నరేష్‌ని డైరెక్టర్ని చేయాలని ఈవీవీ సత్యనారాయణ ఆశ. ఆర్యన్ రాజేష్‌ని హీరోగా చూడాలనుకున్నారు. ఈవీవీ సినిమాలకు దాదాపు సహాయ దర్శకుడిగా పనిచేశాడు నరేష్. ఆ సమయంలో క్లాప్ బోర్డు పట్టుకుని సెట్టంతా తెగ తిరిగేసేవాడు. కానీ.. రాజేంద్రప్రసాద్, నరేష్, బ్రహ్మానందం లాంటి కమెడియన్లని చూడగానే నటుడవ్వాలన్న కోరిక పుట్టింది నరేష్ లో. సెట్లో హీరోలు, కమెడియన్లు చెప్పే డైలాగుల్ని ఇంటికొచ్చి మరీ ప్రాక్టీసు చేసేవాడు. కానీ తండ్రికి చెప్పాలంటే భయం. `నువ్వు డైరెక్టర్. అన్నయ్య హీరో..` అంటూ నాన్న చిన్నప్పుడే చెప్పేయడంతో.. తన మనసులోకి కోరిక ఎప్పుడూ తండ్రి ముందు బయటపెట్టలేదు. `చాలా బాగుంది` సినిమా వంద రోజుల ఫంక్షన్‌కి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ సమయంలో హిందీలో అమితాబ్ తో `సూర్యవంశ్` సినిమా తీస్తున్నాడు ఈవీవీ. `చాలా బాగుంది`కి నరేష్ క్యాషియర్. వేదికపై క్యాషియర్ హోదాలో అమితాబ్ నుంచి షీల్డు అందుకునే సమయంలో… `నరేష్.. ఈవీవీ గారి అబ్బాయి` అని బిగ్ బీకి నరేష్‌కి పరిచయం చేశారెవరో. దాంతో.. `మా అబ్బాయిలా పొడుగ్గా ఉన్నాడు… హీరోగా పనికొస్తాడు` అంటూ ఈవీవీతో అన్నారట బిగ్ బీ.
దాంతో… నరేష్ లో ఉత్సాహం వచ్చేసింది. `స్వయంగా అమితాబ్ బచ్చన్ లాంటివారే చెప్పారు. నన్ను హీరోగా చేయమని. ఇక నీకున్న అభ్యంతరం ఏమిటి` అంటూ నాన్నని అడిగే ధైర్యం వచ్చేసింది నరేష్‌కి. అటు బిగ్ బీ అలా చెప్పడం, ఇటు నరేష్ కూడా `హీరో..` అంటూ కలవరించడంతో, నరేష్ ని యాక్టింగ్ స్కూల్లో చేర్పించారు ఈవీవీ. అలా నరేష్ హీరో అవ్వడం వెనుక బిగ్ బీ హస్తం కూడా కలిసినట్టైంది.