‘నాగబంధం’ అనే సినిమా తాజాగా క్లాప్ కొట్టుకొన్న సంగతి తెలిసిందే. ‘పెదకాపు’ సినిమాతో పరిచయమైన విరాట్ కర్ణ హీరో. ఈ సినిమా బడ్జెట్ పై టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాపై దాదాపు రూ.70 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్టు టాక్. ఇది ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట. విరాట్ కర్ణ తొలి సినిమా ‘పెదకాపు’ పెద్ద డిజాస్టర్. ఆ సినిమాకీ దాదాపు రూ.40 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టారు. అందులో పావు వంతు కూడా తిరిగి రాలేదు. అలాంటిది ఈ సినిమాపై ఇన్ని కోట్లా? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకుడు. ఆయనకూ దర్శకుడిగా పెద్దగా అనుభవం లేదు.
కాకపోతే కథ అంత ఖర్చు డిమాండ్ చేస్తోందని టాక్. సోషియో ఫాంటసీ అంశాలతో ముడి పడిన కథ ఇది. సినిమా మొత్తం గ్రాఫిక్స్ తోనే నడుస్తుందట. పద్మనాభస్వామి టెంపుల్ చుట్టూ సాగే కథ ఇదని తెలుస్తుంది. ఈ దేవాలయం చుట్టూ ఎన్నో విచిత్రమైన కథలు వినిపిస్తుంటాయి. ఆ కథలకు ఇంకాస్త డ్రామా జోడించి ఈ సినిమా తీస్తున్నారని సమాచారం. నభానటేషా, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరో నాయికకూ చోటుంది. ఆమె పేరు త్వరలో ప్రకటిస్తారు. ఈనెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇందులో కొంతమంది పాన్ ఇండియా స్టార్లు కూడా కనిపించబోతున్నారని సమాచారం.