మోడీ హవా… 2014లో మొదలైంది. ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి. కర్ణాటకలో కూడా భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, దీంతో 22 రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉన్నట్టు అవుతుంది. ఇదే సమయంలో వరుసగా కాంగ్రెస్ పార్టీకి అధికారం దూరమౌతున్న రాష్ట్రాల సంఖ్యగా కూడా పెరుగుతున్నట్టు లెక్క. అయితే, ప్రస్తుత ట్రెండ్ ప్రకారం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పనితీరు ఇంతే పేలవంగా ఉంటుందన్న అంచనాకి రావొచ్చా..? గత ఎన్నికలు మాదిరిగానే 2019లో కూడా మోడీ మేనియా కొనసాగుతుందని అంచనా వెయ్యొచ్చా.. అంటే, అలాంటి నిర్ణయానికి రావడానికి ఇంకా సమయం ఉందని చెప్పొచ్చు. కర్ణాటక ఫలితాన్ని నేపథ్యంగా చేసుకుని అలాంటి అంచనా వేయడం సరికాదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే ఉన్నాయి. వీటిలో మూడు రాష్ట్రాల్లో భాజపా పాలితాలే.
వివిధ రాష్ట్రాల్లోని వరుసగా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుండటానికి ప్రధాన కారణం… ప్రభుత్వ వ్యతిరేకత. కొన్నాళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీపై వ్యతిరేకత అనేది సర్వసాధారణంగానే ఉంటుంది. భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. మోడీ ఏదో అద్భుతం చేస్తారు అనే ప్రచారం ఆకర్షణీయంగానే ఉంటుంది. అదే అంశం భాజపాకి అనుకూలంగా పనిచేస్తూ వస్తోంది. ఇదే సమయంలో, ప్రభుత్వ వ్యతిరేకతను మేనేజ్ చేసుకోవడం కూడా కాంగ్రెస్ కు చేతగాని అంశంగా తయారౌతోంది.. సరే, అది ఆ పార్టీ సమస్య! ఇక, భాజపా పాలిత రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ముఖ్యం. ఎందుకంటే, భాజపాపై ప్రజల్లో కొంత విముఖత ఉందనేది వాస్తవం. పంజాబ్, గోవాల్లో కొంత వ్యక్తమైందీ అదే. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో తేలిందీ అదే. అంతెందుకు, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా చావుతప్పి కన్నులొట్టపోయిన పరిస్థితి ఎదురుకావడానికీ కారణం కూడా అదే. ఇవి భాజపా పాలిత రాష్ట్రాలే అనే విషయం గుర్తించాలి.
ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో మోడీ షా ద్వయం ముందుకు రాబోతున్న మెగా ఛాలెంజ్… భాజపా పాలిత రాష్ట్రాల్లో సహజంగా వ్యక్తమయ్యే ప్రభుత్వ వ్యతిరేకతకు ఎదురీదడం! మరీ ముఖ్యంగా, ముందుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడం అవసరం. 2014 నాటి పరిస్థితి కాంగ్రెస్ పై ఉన్న తీవ్ర వ్యతిరేకత.. మోడీ హవాకు తోడైంది. కాంగ్రెస్ పాలనతో విసిగిన దేశానికి, మోడీ ఏదో చేస్తారన్న ఆశ ఆలంబన అయింది. కానీ, ఇప్పుడు మోడీ పాలనను కూడా ప్రజలు ఐదేళ్లు చూసేస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరలు, నిత్యావసరాల ధరలు పెరుగుదల, నిరుద్యోగం… ఇలాంటివన్నీ సామాన్యుల్లో మోడీ వ్యతిరేకతను పెంచిన అంశాలే. కాబట్టి, 2019లో భాజపా పాలిత రాష్ట్రాల్లో రెండు రకాల ప్రభుత్వ వ్యతిరేకతలను మోడీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటిది.. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ వ్యతిరకత అయితే, రెండోది కేంద్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత. ఏ రాష్ట్రానికి తగ్గట్టుగా ఆ రాష్ట్రానికి వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్న మోడీ షా ద్వయం… 2019 నాటికి ఎలాంటి ఫార్ములాతో ముందుకొస్తారో చూడాలి.