ఈటీవీని నిలబెట్టిన షో.. ‘పాడుతా తీయగా’. ఎస్.పీ బాలసుబ్రహ్మణ్యం సారథ్యంలో ఏళ్ల తరబడి… ఈ షో కొనసాగుతూ వచ్చింది. రామోజీరావు మానస పుత్రిక ఈ కార్యక్రమం. బాలు తరవాత ఈ షోకి పుల్ స్టాప్ పడుతుందని అనుకొన్నారు. కానీ.. చరణ్ ఈ షోని ముందుండి నడిపిస్తున్నారు. ఇది వరకటి స్థాయిలో లేదు కానీ.. ‘పాడుతా తీయగా’ తన ప్రత్యేకతని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. మిగిలిన రియాలిటీ షోస్‌లో ఉండే మెలోడ్రామాలు ఈ షోలు కనిపించవు. చాలా పద్ధతిగా `ఈటీవీ` మార్క్ లో సాగే షోకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అయితే.. తొలిసారి ఈ షోపై మచ్చ పడింది.
ప్రవస్తి ఆరాధ్య అనే గాయని ఈ షోపై ముఖ్యంగా న్యాయ నిర్ణేత కీరవాణిపై చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కీరవాణి తనని అవమాన పరిచారని, మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడారని ప్రవస్తి చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తొలిసారి ‘పాడుతా తీయగా’ కార్యక్రమానికి డామేజ్ కలిగించాయి. కీరవాణి జడ్జ్మెంట్ సరిగా ఉండదని, ఆయన కంపోజ్ చేసిన పాటలు పాడితే ఒకలా మార్కులు ఇస్తారని, లేదంటే హీనంగా చూస్తారని ప్రవస్తి పెద్ద ఆరోపణలే చేసింది. పైగా పెళ్లిళ్లలో పాటలు పాడేవాళ్లు గాయకులే కారని, తనని ఉద్దేశించి చెప్పడం మానసికంగా తనని కృంగదీసిందని ఆరాధ్య ఆరోపిస్తున్నారు. షో నిర్వహణపై కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారామె. డ్రస్ కోడ్ ఈటీవీ వాళ్లే డిసైడ్ చేస్తున్నారని, చీరలు కట్టుకొనేటప్పుడు బొడ్డు కింద కట్టాలి.. అంటూ సలహాలు ఇస్తున్నారని వాపోయారామె.
ఇది వరకు ఈటీవీలో వచ్చే డాన్స్ షోలు.. కాస్త రచ్చ అయ్యాయి. కానీ ‘పాడుతా తీయగా’ క్లీన్ ఇమేజ్ సంపాదించుకొంది. ఇప్పుడు అలాంటి షోపై కూడా నెగిటివిటీ స్పైడ్ అవుతోంది. షో నుంచి ఎలిమినేట్ అయినవాళ్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం మామూలే. కానీ మీడియా ముందుకు వచ్చి కీరవాణి లాంటి సంగీత దర్శకుడ్ని వేలు పెట్టి చూపించడం, పాడుతా తీయగా షోలో ఉండే దోషాల్ని బయటకు చెప్పడం సంచలనంగా మారింది. రామోజీ రావు మరణం తరవాత.. ఈటీవీ కార్యక్రమాలపై ఆరా బాగా తగ్గిందని, కొంతమంది ఉద్యోగుల సొంత పెత్తనాలు ఎక్కువయ్యాయని, అందుకే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సివస్తోందని ‘ఈటీవీ’ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. ఏదేమైనా రామోజీరావు మానస పుత్రిక లాంటి కార్యక్రమంపై విమర్శలు రావడం ఇబ్బందికరమైన విషయమే. ఇప్పటికైనా మేనేజ్మెంట్ అసలు ఈ షోలో ఏం జరుగుతోందో ఆరా తీసి, తగిన మరమ్మత్తులు చేస్తే బాగుంటుంది.