సుహాస్ ఈమధ్య రెండు మూడు నెలలకో సినిమా వదులుతున్నాడు. తన సినిమా వస్తోందంటే ఎంతో కొంత అటెన్షన్ ఉంటుంది. అయితే.. అందుకు విరుద్ధంగా సైలెంట్ గా ‘గొర్రెపురాణం’ విడుదల చేసేశారు. ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది. బడ్జెట్ కూడా పరిమితుల్లోనే ఉంది. అందుకే విడుదలకు ముందు ఎలాంటి హడావుడీ చేయలేకపోయారు. థియేటర్లు కూడా తక్కువే దొరికాయి. ఎంత సైలెంట్ గా వచ్చిందో, అంతే సైలెంట్ గా వెళ్లిపోయింది. అయితే నిర్మాతలు మాత్రం సేఫ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. సుహాస్ గత విజయాల వల్ల.. ‘గొర్రెపురాణం’ కాస్త సేఫ్ అయ్యిందని టాక్. తన గత చిత్రాలు ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ కంటే బెటర్ మార్కెట్ జరిగిందని నిర్మాతలు చెబుతున్నారు.
ఈ సినిమాతో బాబీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాలా కాంప్లికేటెడ్ కథని, బోల్డ్ గా, సెటైరికల్ గా చెప్పిన విధానం విమర్శకులకు నచ్చింది. అందుకే రెండు పెద్ద నిర్మాణ సంస్థల నుంచి బాబీకి ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఓ టైర్ 2 హీరో.. బాబీతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్. ఈ సినిమాని కాస్త ప్రమోట్ చేయగలిగితే బాగుణ్ణు. ఎందుకంటే 20న ‘గొర్రె పురాణం’ తప్ప మరో సినిమా రాలేదు. సోలోగా వచ్చినందుకు కాస్తో.. కూస్తో ప్రతిఫలం దక్కేది. ఓ సినిమా వల్ల, ఆ దర్శకుడికి ఇంకో ఆఫర్ వచ్చింది. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయినట్టే అనుకోవాలి.