వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో తమను తాము ఎలా డిఫెండ్ చేసుకోవాలో ఆ పార్టీకి అర్థం కావడం లేదు. ఓ వైపు వలసలు.. మరో వైపు ఐదేళ్లలో చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇవన్నీ ప్రజల్లో పరువు తీస్తున్నాయి. పార్టీ నేతల్ని జైలు పాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ చిన్న చిన్న రాళ్లే పడ్డాయని తర్వాత వైసీపీపై అణుబాంబు పడబోతోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తర్వాత వెల్లడి కాబోయే వైసీపీ నిర్వాకం … ఆ పార్టీని ప్రజలు అసహ్యించుకునేలా ఉంటుందని…జాతీయ స్థాయిలో ఎవరూ కనీసం సపోర్టు చేయనంత బలమైన అంశమని అంటున్నారు.
ఐదేళ్లలో జగన్ రెడ్డి పరిపాలన అంతా అక్రమాల మయయే. ఏ నిర్ణయం తీసుకున్నా వ్యక్తిగత స్వార్థమే. ప్రజల ఖాతాల్లో చిల్లర వేస్తే ఏం చేసినా సైలెంట్ గా ఉంటారని అనుకున్నారు. ప్రజలు తాము బిచ్చగాళ్లం కాదని నిరూపించారు. ఓటుతో కొడితే జగన్ పాతాళంలోకి పడిపోయారు. ఇప్పుడు ఆయన చేసిన నిర్వాకాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల్ని మాఫియాలాగా ఎలా వాడుకున్నారన్న అంశం దగ్గర నుంచి … ప్రజా ధనాన్ని ఎలా దోచుకున్నారో స్పష్టమవుతోంది. చివరికి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన వ్యవహారం వెలుగు చూసింది. త్వరలో అసలు ప్రజల ఆరోగ్యాల్ని నాశనం చేయడం, వారి ఆస్తుల్ని సైతం దోచుకునేందుకు వేసిన పక్కా ప్రణాళికలేమిటో వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జగన్ రెడ్డి అధికారం ఉందని.. కుట్రల పాలన చేశారు. ఆయన పాలన అంటే… ఐదేళ్ల పాటు విపక్ష నేతల్ని ఎలా వేధించాలన్న సమావేశాలే. తాడేపల్లిలో జరిగిన ఆ సమావేశాల తరవాతే.. ఎవరి ఆస్తుల్ని టార్గెట్ చేయాలి.. ఎవరిని అరెస్టు చేయాలి,.. వారిపై ఎలాంటి ఆరోపణలు చేయాలి.. వంటి స్క్రిప్టులు రెడీ చేసేవారు. దానికి తగ్గట్లుగా స్క్రీన్ ప్లే రెడీ చేసుకుని రంగంలోకి దిగిపోయేవారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఇతర పోలీసులు తమ పంచాయతీలు తాము చేశారు. ఫలితంగా ప్రజలకు భరోసా లేకుండా పోయింది. వ్యవస్థలన్నీ అచేతనం అయ్యాయి.
వైసీపీ చేసిన నిర్వాకాల్లో అతి పెద్ద స్కాంను… తర్వాత బయట పెట్టబోతున్నారు. అది ఇసుక స్కామా.. లేకపోతే మద్యం స్కామా అన్నది స్పష్టత లేదు. ఇప్పటి వరకూ ఎవరూ ఊహించని నిర్వాకాలనే బయటకు తెస్తున్నారు. జత్వానీ కేసు అయినా… తిరుమల నెయ్యి కల్తీ అయినా ఎవరూ ఊహించనివే. తరవాత కూడా అలాంటి వ్యవహారమే బయటకు రానుంది. అది వైసీపీకి అణుబాంబులా మారే అవకాశం కనిపిస్తోంది.