వెంకటేష్ కి కథ చెప్పి ఓకే చేయించడం అంత తేలిక కాదు. చాలా కసరత్తులు వుంటాయి. రిమేక్ కథ పాసైనంత సులువుగా ఆయన దగ్గర ఒరిజినల్ కథకు ఆమోద ముద్రపడదు. అయితే ఇప్పుడు రిమేకులకు కాలం చెల్లింది. ఇండియాలో ఏ భాష సినిమా అయినా ఓటీటీలో చుసేస్తున్నారు. నారప్ప తెలుగు ఆడియన్స్ పట్టకపోవడానికి కారణం అదే. ఇప్పుడు చేస్తే ఒరిజినల్ కథే చేయాలి.
వెంకటేష్ కోసం ఓ నాలుగు పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు కథని సిద్ధం చేసే పనిలో వున్నాయి. సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్, మైత్రీ మూవీ మేకర్స్, సితార నాగవంశీ, వైజయంతి మూవీస్,, ఇలా నాలుగు సంస్థలు కథలు రెడీ చేస్తున్నాయి. కానీ దేనికి ఆమోదముద్ర పడలేదు. ఈవిషయాన్ని స్వయంగా వెంకీనే చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం తర్వాత చేయబోయే సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. నాలుగు సంస్థలు కథని సిద్ధం చేసే పనిలో వున్నాయి’ అన్నారు.
వెంకటేష్ కి మంచి సంక్రాంతి ట్రాక్ రికార్డ్ వుంది. సంక్రాంతికి వస్తున్నాం కూడా మరో విజయం ఇస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారాయన. ఇందులో తన మార్క్ వినోదం వుంటూనే క్రైమ్ ఎలిమెంట్ సస్పెన్స్ కూడా ఉంటుందని, క్లైమాక్స్ లో అందరూ సర్ ప్రైజ్ అవుతారని అన్నారు. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.