తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పాలనపై మరింత ఫోకస్ పెట్టనుంది. ప్రాధాన్యత అంశాలను ముందుగా గుర్తించి వాటిపై చర్చించనుంది. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలను తీసుకునేందుకు ఆటంకంగా మారింది. తాజాగా కోడ్ ముగియడంతో ప్రభుత్వం, మంత్రులు , అధికారులు సమీక్షలతో బిజీ కానున్నారు.
దాదాపు మూడు నెలలపాటు కీలకమైన అంశాలపై సమీక్షలు నిర్వహించేందుకు ఆంక్షలు ఉండటంతో సీఎం , మంత్రులు అత్యవరసరమైన అంశాలపై మాత్రమే చర్చించారు. విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలు లేకుండా పోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకే వేదిక నుంచి నిర్ణయాలు తీసుకోవడంపై ఆంక్షలు ఉండటంతో ముఖ్యమైన అంశాలను ఫోన్ లో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వానికి ఉపశమనం లభించినట్లు అయింది. దీంతో ఇప్పుడు పాలనపై రేవంత్ అండ్ టీం ఫుల్ ఫోకస్ పెట్టనుంది.
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోన్న ప్రభుత్వం త్వరితగతిన కుల గణన పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలనే అంశంపై అధికారులతో ప్రభుత్వం చర్చించనుంది. కుల గణన కోసం ఇతర రాష్ట్రాల్లో సర్వే జరిపిన తీరును పరిశీలించి ఇంటింటి సర్వే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా ఆయా శాఖల అధికారులు ప్రాధాన్యత అంశాలను ముఖ్యమంత్రి, మంత్రి టేబుల్ మీదకు తీసుకెళ్ళి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నారు.
మరోవైపు ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీని సమావేశపరిచి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బడ్జెట్ రూపకల్పనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులతో చర్చించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ళు, రైతు రుణమాఫీలను రేవంత్ మొదటి ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.