విచారణ పేరుతో ఏపీ పోలీసుల వేధింపులకు గురవుతున్న ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తి… హైకోర్టు నుంచి రిలీఫ్ పొందారు. చానల్ చర్చా కార్యక్రమంలో యూనివర్శిటీల పాలకవర్గాలకు సంబంధించి అన్నీ ఒక్కరెడ్డి సామాజికవర్గానికే అదీ కూడా వైసీపీ నేతల సిఫార్సులతోనే నియమించారన్న ఆధారాలను మూర్తి బయట పెట్టారు. వాస్తవానికి బయటపెట్టింది..ఆ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న శ్రావణ్ కుమార్ అనే న్యాయవాది. అయితే..అవి తన కార్యాలయంలో ఉండాల్సినవి చోరీ చేయడమో.. జిరాక్స్ తీసుకోవడమో చేశారంటూ…. సంబంధిత శాఖ ఉన్నతాధికారితో ప్రభుత్వం కేసు పెట్టించింది. అందులో ఆ శ్రావణ్ కుమార్తో పాటు టీవీ5 చైర్మన్, ఆ చర్చ కార్యక్రమాన్ని నిర్వహించిన మూర్తిపైనా కేసులు పెట్టారు.
వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు హైదరాబాద్ వచ్చిన సమయంలో… విచారణకు హాజరయ్యే షరతు మీద ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కానీ పోలీసులు ఆ షరతును తమకు అనుకూలంగా మల్చుకున్నారు. వారానికి నాలుగు రోజులు విచారణ పేరుతో పిలవడం…ఖాళీగా కూర్చోబెట్టి పంపించడం చేస్తున్నారు. దీనిపై మూర్తి ఓ సారి అసహనం వ్యక్తం చేశారు. ఇలా వేధించడం కన్నా ఒక్క సారే చంపేయాలని వీడియో పెట్టారు. ఆ తర్వాత విచారణ వేధింపుల విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తూ పిటిషన్ వేశారు.
విచారణ జరిపిన హైకోర్టు… ఇంకా విచారణ జరపాల్సిన అవసరం ఉంటే… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని ఆదేశించింది. ఇది మూర్తిగా భారీ రిలీఫ్ ఇచ్చింది. ఎందుకంటే.. ఆయనను పదే పదే విజయవాడకు పోలీసులు పిలవడంతో చర్చా కార్యక్రమాలను అంతరాయం లేకుండా నిర్వహించలేకపోయారు. ఏ రోజు ఆయన స్క్రీన్ మీదకు వస్తారో అర్థం కాని పరిస్థితి. ఆయన స్క్రీన్ పై రాకుండా ఉండటం కోసమే విచారణ పేరుతో వేధించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడీ ఇబ్బంది నుంచి మూర్తి గట్టెక్కారు.