ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ వినియోగంలో భారీ స్కాం జరిగినట్లుగా అనుమానాలు తలెత్తుతున్నాయి. లెక్కల్లో తేడాలు రావడం… లబ్దిదారులు.. వారికి అందిన సాయం వంటి అంశాలపై పొంతన లేకపోవడంతో.. ఉన్నత స్థాయిలో గుట్టుగా ఏసీబీ విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు సచివాలయంలోనే సీఎంఆర్ఎఫ్ వ్యవహారాలు చూసే కొంత మందిని ప్రశ్నించారు. ఈ రోజు ఏకంగా నలభై మంది ఉద్యోగుల్ని గొల్లపూడిలోని ఏసీబీ ఆఫీసుకు పిలిపించారు. వారిని ప్రశ్నిస్తున్నారు. ఇంత మంది ఉద్యోగుల్ని ప్రశ్నిస్తున్నారంటే.. ఏదో భారీ స్కాం జరిగి ఉంటుందని సెక్రటేరియట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సీఎంఆర్ఎఫ్ .. పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణ మేరకు వినియోగించే నిధి. ప్రభుత్వానికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే సీఎంఆర్ఎఫ్‌కే ఇస్తారు. ఇటీవలి కాలంలో కరోనా కారణంగా పెద్ద ఎత్తున విరాళాలు సీఎంఆర్ఎఫ్కు జమ అయ్యాయి. వైసీపీ నేతలు నియోజకవర్గాల వారీగా.. దాదాపుగా రూ. కోటి టార్గెట్ పెట్టుకుని.. చందాలు వసూలు చేసి.. సీఎంఆర్ఎఫ్కు జత చేయించారు. ఇటీవల ఏపీ సర్కార్ ఉచిత వ్యాక్సిన్లను పంపిణీ చేయాలనుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించేందుకు ప్రణాళికలు వేశారు. కొంత మంది వద్ద సేకరించారు కూడా. అవి కాకుండా ప్రభుత్వం కూడా కొంత కేటాయిస్తుంది.
ఆరోగ్యశ్రీతో సేవలు పొందలేని రోగాలు.. ఇతర అసాధారణమైన నష్టాల వల్ల రోడ్డున పడ్డకుటుంబాలు.. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ఏపీ సీఎం నేరుగా సాయంచేసేందుకు ఈ ఫండ్‌ను ఎక్కువగా వినియోగిస్తారు. కొద్ది రోజుల కిందట… సూట్ కేసు కంపెనీల పేరుతో నకిలీ చెక్కులు సృష్టించి.. సీఎంఆర్ఎఫ్ నుంచి 110 కోట్ల వరకూ కొట్టేసే ప్లాన్ చేశారు. అన్నీ ఆధారాలు దొరికినప్పటికీ నిందితుల్ని పట్టుకోలేకపోయారు. ఇప్పుడు… అలాంటి స్కాం ఏం జరిగిందో.. అధికారులు బయటపెట్టే వరకూ తెలియదు. ఏమీ జరగకపోతే.. ఆ విభాగంలో ఉన్న ఉద్యోగులందర్నీ ఏసీపీ ఆఫీసుకు పిలిపించి మరీ ప్రశ్నించరని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.