బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. విద్యుత్ కమిషన్ ను కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది.
నిబంధనల మేరకే పవర్ కమిషన్ వ్యవహరిస్తోందని..కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కు విచార్హత లేదని అడ్వకేట్ జనరల్ వాదనలను హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం సమర్ధించింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని కేసీఆర్ తరఫు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదిస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టులో పవర్ కమిషన్ విచారణకు లైన్ క్లియర్ కావడంతో త్వరలోనే కేసీఆర్ కు మరోసారి పవర్ కమిషన్ నోటీసులు ఇవ్వనుంది.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ళు, ఒప్పందాలపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోరుతూ కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాము నిర్దేశించిన గడువులోగా సమాధానం చెప్పాలని పవర్ కమిషన్ ఆదేశించగా.. తనకు మరింత సమయం కావాలంటూ కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని విద్యుత్ కమిషన్ తోసిపుచ్చింది. దీంతో పవర్ కమిసన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ పిటిషన్ ను తాజాగా కొట్టివేయడంతో కేసీఆర్ విద్యుత్ కమిషన్ ముందు త్వరలోనే హాజరు కావాల్సి ఉంటుంది.