వైసీపీ అధినేత జగన్ కు మరోషాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండపేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెలల జైలు శిక్ష విధించింది. 28 సంవత్సరాల క్రితం ఐదుగురు దళితుల శిరోముండనం కేసులో కోర్టు తీర్పు వెలువరించింది.
హైకోర్టు సూచనతో కేసును విచారించిన దిగువ కోర్టు… తోట త్రిమూర్తులు సహా మొత్తం 10మందిని దోషులుగా తేల్చింది. ఇందులో ఒకరు ఇప్పటికే మరణించారు.
తోట త్రిమూర్తులుకు ఒక సెక్షన్ లో 18నెలల జైలు శిక్షతో పాటు లక్షా యాబై వేల జరిమానా కూడా విధిస్తూ తీర్పునిచ్చింది.
1996, డిసెంబర్ 26న వెంకటాయపాలేంలో ఈ ఘటన జరిగింది. ఎన్నికల కక్షతో ఐదుగురు దళితులకు శిరోముండనం చేశారని కేసు నమోదైంది. అయితే, 1998లో ఇది అక్రమ కేసు అని ఆనాడు కేసు కొట్టివేయగా, 2000 సంవత్సరంలో ప్రభుత్వం కేసును రీఓపెన్ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 146సార్లు వాయిదా పడుతూ కేసు విచారణ సాగిన తర్వాత విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు తుది తీర్పు వెలువరించింది.
అయితే, తోట త్రిమూర్తుల శిక్ష విషయంలో మీరేమైనా చెప్పదల్చుకున్నారా అని న్యాయమూర్తి అడగ్గా… నన్ను రాజకీయం దెబ్బతీసేందుకే ఇదంతా అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. నేను ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మనోవేధనను అనుభవించానని, 87 రోజుల పాటు రిమాండ్ లో కూడా ఉన్నానన్నారు.