లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఒక కీలకమైన రాజకీయ పరిణామం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) చేతులు కలిపేందుకు అధికారికంగా ముందుకొచ్చాయి. ఈ సందర్బంగా మాయావతి, అఖిలేష్ యాదవ్ లక్నోలో మీడియా ముందుకు వచ్చారు. తమ స్నేహం రాబోయే లోక్ సభ ఎన్నికలతోపాటు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందన్నారు. యూపీలో మొత్తం 80 లోక్ సభ స్థానాలకుగానూ చేరో 38 సీట్లలో పోటీ చేస్తామనీ, అమేథీ, రాయబరేలీలో రెండు పార్టీలూ పోటీకి దిగడం లేదని మాయావతి చెప్పారు. కాంగ్రెస్ ను తమ కూటమి నుంచి పక్కన పెట్టామనీ, ఆ పార్టీతో కలిసుంటే పెద్దగా ప్రయోజనం ఉండదనే స్పష్టతకు వచ్చామన్నారు.
తక్కువ సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యామనీ, అందుకే తమ పార్టీల మధ్య స్నేహం సాధ్యమైందన్నారు అఖిలేష్ యాదవ్. ఎన్నికల తరువాత ప్రధానమంత్రి అభ్యర్థి ఉత్తరప్రదేశ్ నుంచి ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నాననీ, ఎవరి గురించి మాట్లాడుతున్నానో, ఎవరికి మద్దతు ఇస్తానో అందరికీ తెలుసు అన్నారు అఖిలేష్. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీపై మాయావతి ఎక్కువగా విమర్శలు చేశారు. ఆమెతో పోల్చితే అఖిలేష్ తక్కువగా విమర్శించారు. కులాలవారీగా జరుగుతున్న రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న ఉద్దేశంతో తమ మధ్య ఉన్న గత రాజకీయ శతృత్వాలను వదిలిపెట్టి ముందుకొచ్చామని ఇద్దరు నేతలూ చెప్పారు. అయితే, కాంగ్రెస్ భాజపాలకు సమాన దూరంలో ఎస్పీ బీఎస్పీల బంధం ఉందని చెప్పలేం. ఎందుకంటే, రాహుల్ గాంధీకీ సోనియాకీ ఒక్కో లోక్ సభ స్థానం వీరు కేటాయించారు కదా. ప్రధాని అభ్యర్థిత్వానికి సంబంధించి అఖిలేష్ వ్యాఖ్య కూడా రెండు అర్థాలు వచ్చేలా ఉంది. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధాని అభ్యర్థి ఉండాలని ఆయన ఆకాంక్షించింది మాయావతిని దృష్టిలో పెట్టుకుని చెప్పినట్టా..? లేదంటే, యూపీ నుంచి పోటీ చేయబోతున్న రాహుల్ గాంధీని దృష్టిలో ఉంచుకుని అన్నట్టా..?
యూపీలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిమాణం భాజపాకి కచ్చితంగా నిద్రపట్టనీయని అంశంగానే మారుతుంది. గత ఎన్నికల్లో యూపీలో భాజపాకి ఏ స్థాయి మెజారిటీ ఎంపీ సీట్లు వచ్చాయో తెలిసిందే. ఈసారి ఆ అవకాశం భాజపాకి ఉండదనేది స్పష్టమౌతోంది. అయితే, గత ఎన్నికల్లో తమకు పడ్డ ఓట్లన్నీ ఈసారి వేరే పార్టీలకు బదిలీ అయ్యే పరిస్థితి లేదంటూ ప్రధాని మోడీ ఈ పొత్తు నేపథ్యంలో వ్యాఖ్యానించారు. ఏదేమైనా, యూపీలో భాజపాకి రాబోయే లోక్ సభ ఎన్నికలు గడ్డుకాలమే.