జర్నలిస్టు, పోలీసు కలిసి కేసులు లేకుండా చేస్తామని డబ్బులు వసూలు చేస్తూ దొరికిపోయారు. ఖమ్మం జిల్లా మణుగూరులో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి సీఐ సతీష్ కుమార్, బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపిలను అరెస్టు చేశారు. ఓ వ్యక్తి దగ్గర లక్ష క్యాష్ తీసుకుంటూ మిట్టపల్లి గోపి దొరికిపోయారు.
ఇటీవల ఓ బెట్టింగ్ కేసు నమోదు అయింది. ఈ కేసులో కొంత మందిని చేర్చకుండా ఉండటానికి వారి వద్ద నుంచి పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారు. పోలీసులకు, బాధితులకు మధ్య మధ్యవర్తిగా రిపోర్టర్ ఉన్నారు. కేసు పెట్టకుండా చూసుకుంటా.. ఇంత అని బేరం ఆడాడు. చివరికి నాలుగు లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. వాళ్లు ఏసీబీకి సమాచారం ఇచ్చారు. డబ్బులు ఇస్తూండగా ట్రాప్ చేసి పట్టుకున్నారు.
పోలీసుల్ని పట్టుకుంటే వారు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఏసీబీ అధికారులు పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ జర్నలిస్టులు కూడా ఇలాంటి కేసుల్లో అరెస్టు అయితే వారు పని చేస్తున్న సంస్థల పరువు ఏం కావాలి?. పోలీసులతో కలిసి దందాలు చేస్తే.. పోలీసులు పట్టుకోరు కదా అనుకుంటే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి.