తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఖాయం కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. చాలామంది నేతలు మంత్రి పదవులను ఆశిస్తుండటంతో కేబినెట్ లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనని వెయిట్ చేస్తున్నారు. మొదట ఈ నెల7న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంగా ఖరారు చేసినా 5వ తేదీ తర్వాత అమావాస్య, ఆషాడమాసం వస్తుండటంతో నిర్ణయం మార్చుకున్నారని… గురువారమే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ జరుగుతోంది.
మంత్రి పదవుల కోసం ఆశావహులు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ కూర్పు ఫైనల్ కాగా,ఏఐసీసీ పెద్దల పరిశీలన అనంతరం అధికారికంగా పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. అయినా నేతలు తమ ప్రయత్నాలను ఆపడం లేదు. కేబినెట్ లో ఆరు స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉన్నా, ప్రస్తుతం నలుగురిని తీసుకుంటారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార విషయంపై చర్చించేందుకే గవర్నర్ తో సీఎం రేవంత్ భేటీ అయినట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. సీతక్క శాఖ మార్పు ఖాయమని ఆమెకు హోంశాఖను కట్టబెడుతారని పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి.
కేబినెట్ లో కొత్తగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్ , ఓ మైనార్టీ నేతకు అవకాశం దక్కవచ్చునని టాక్ వినిపిస్తోంది. గవర్నర్ తో సీఎం , అసెంబ్లీ కార్యదర్శి భేటీతో కేబినెట్ విస్తరణ ఖాయమని విస్తృతంగా ప్రచారం జరుగుతోన్నా .. ఇదంతా మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని అసెంబ్లీ వర్గాలు పేర్కొనడటం గమనార్హం. దీంతో కేబినెట్ విస్తరణ ఉంటుందా..? అనే సందిగ్ధం నెలకొంది.