ఇప్పటి వరకూ నడిచిన బిగ్ బాస్ 2 ఎపిసోడ్లు ఒక యెత్తు. సోమవారం నాటి ఎపిసోడ్ మరో ఎత్తు అనిపిస్తోంది. మామూలుగా, స్థబ్దుగా, అప్పుడప్పుడూ కొంచెం కొంచెం షాక్ ఇస్తూ సాగుతున్న బిగ్ బాస్ 2లో.. సోమవారం నాటి ఎపిసోడ్ కేక పుట్టించింది. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓ విధంగా పరీక్ష పెట్టింది. సోమవారం కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేషన్జోన్ లో పడిపోయారు. అందులోంచి బయటకు రావాలంటే… మరో కంటెస్టెంట్ సహాయం తీసుకోవాల్సివచ్చింది. ఒకరి కోసం మరొకరు ఏమైనా త్యాగం చేస్తే.. ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చన్నమాట. గణేష్ ని ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి బాబు గోగినేని రెండు కట్టల కొత్తిమీర ని పర పర నమిలేయాల్సివచ్చింది. తేజస్విని కాపాడడానికి సామ్రాట్ క్లీన్ షేవ్ చేసుకున్నాడు. గీతా మాధురని రక్షించడానికి తేజస్విని తనకు ఎంతో ఇష్టమైన తెల్ల దుప్పటిని ఎందుకూ పనికిరాకుండా ముక్కలు ముక్కలుగా చేయాల్సివచ్చింది. రోల్ రైడర్ తన జుట్టుకు ఎరుపు రంగు పూసుకున్నాడు. ఇలా.. ఒకరిని కాపాడడానికి మిగిలిన వారు ఏదో ఓ త్యాగం చేశారు. కౌశల్, అమిత్ తివారీ మాత్రం.. త్యాగాలకు సిద్ధపడకపోవడంతో దీప్తి, భాను ఎలిమినేష్ ప్రమాదంలో పడ్డారు. ఇలా ఎవరికి ఏ టాస్క్ ఇస్తారో, దాన్ని వాళ్లు ఎలా స్వీకరిస్తారో అనే టెన్షన్… ఈ ఎపిసోడ్లో కనిపించింది. తమ స్నేహితుల్ని కాపాడడానికి కొంతమంది సంతోషంగా టాస్క్ లు స్వీకరిస్తే.. ఇద్దరు మాత్రం భయపడిపోయారు. దాంతో.. రాబోయే ఎపిసోడ్లలో మరింత డ్రామా పండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.