దాదాపుగా పది వారాల పాటు తెలుగు లోగిళ్లలో తిష్ట వేసుకొని మరీ కూర్చున్నాడు బిగ్ బాస్. తెలుగు వరకూ ఇదో కొత్త కార్యక్రమం. బుల్లి తెర ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారో అన్న బెంగ ఉండేది. కానీ ఎన్టీఆర్ తన యాంకరింగ్ స్కిల్స్‌తో అదరగొట్టేసి – టాప్ 1 పోగ్రాంగా మార్చేశాడు. బిగ్ బాస్ జరుగుతున్నంత సేపూ.. ఈ కార్యక్రమమే చర్చల్లో నిలిచింది. మొత్తానికి శివబాలాజీని విజేతగా ప్రకటించి తొలి సీజన్‌కి పుల్ స్టాప్ పెట్టారు. రేపో – మాపో రెండో సీజన్ కి సంబంధించిన పనులూ మొదలైపోతాయి. అయితే.. ఇంతకీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్న సెలబ్రెటీలకు ఒరిగిందేంటి?? వాళ్ల ఇమేజ్‌లు ఏమైనా మారాయా? కొత్తగా అవకాశాలు వస్తున్నాయా?? అని ఆలోచిస్తే సంతృప్తి కరమైన సమాధానాలు దొరకడం లేదు. ప్రిన్స్, అర్చన, శివ బాలాజీ, నవదీప్, ముమైత్ ఖాన్, ఆదర్శ్… వీళ్లంతా అవుడ్ టేడెడ్ అయిపోయిన ఆర్టిస్టులే! బిగ్ బాస్ తరవాత వీళ్లకు క్రేజ్ పెరుగుతుంది, మళ్లీ అవకాశాలొస్తాయి అనుకొన్నారంతా. కానీ… ఇప్పటి వరకూ వీళ్లలో ఎవరికీ వెండి తెరనుంచి పిలుపు రాలేదు. వస్తుందన్న నమ్మకమూ లేదు. ధన్‌రాజ్, సంపూలకు ఎలాగూ అవకాశాలు వస్తుంటాయి. మరి మిగిలిన వాళ్ల సంగతేంటి..??
”ఈ షో వల్ల మళ్లీ పరిశ్రమ దృష్టిలో పడతానని, వాళ్లు పిలిచి అవకాశాలిస్తారని అనుకొన్నా. కానీ అదేం జరగడం లేదు. గుర్తింపు రావడం, కాస్త గ్యాప్ తగిలితే జనం మర్చిపోవడం కామన్ అయిపోయాయి. ఇన్ని రోజులు ఇంటికీ, సోషల్ లైఫ్‌కి దూరంగా గడిపినందుకు తగిన ప్రతిఫలం లభించలేదు. బిగ్ బాస్ షోలో పాల్గొని చాలా విషయాలు నేర్చుకోగలిగాను గానీ – నా కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడలేదు” అంటూ బిగ్ బాస్‌లో పాలు పంచుకొన్న ఓ సెలబ్రెటీ వాపోతున్నాడు. దీన్ని బట్టి… బిగ్ బాస్ షో వల్ల మాటీవీ, తారక్‌లు లాభపడ్డారేమో గానీ, పాలుపంచుకొన్న సెలబ్రెటీలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నది రూఢీ అవుతోంది. భవిష్యత్తులో అయినా… వీళ్లకు పిలుపు వస్తుందేమో చూడాలి.