ఇప్పటి వరకూ చూసిన రియాలిటీ షోలలో బిగ్ బాస్‌ది ప్రత్యేకమైన స్థానం. కొంతమంది సెలబ్రెటీలు ఓ ఇంట్లో ఉంటారు. కొన్ని రోజుల పాటు బయటి ప్రపంచంతో వాళ్లకు సంబంధాలు ఉండవు. వాళ్లే వండుకొంటారు.. వాళ్ల పనులు వాళ్లే చేసుకొంటారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం.. మిగిలిన వాళ్లతో ఎలా ఇమడగలిగారు? వాళ్లతో ఎలా ప్రయాణించారన్న విషయం ఆధారంగా విజేత ని ప్రకటిస్తారు. హిందీతో పాటు తెలుగు, తమిళ ప్రాంతీయ భాషల్లోనూ ఈ షో సక్సెస్ అయ్యింది. తెలుగులో ఎన్టీఆర్ అయితే తన యాంకరింగ్ స్కిల్స్‌తో అదరగొట్టేశాడు. అయితే ఈ బిగ్ బాస్ పై ముందు నుంచీ తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ షో ఫేక్ అని… ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో షోలో పాల్గొనే సెలబ్రెటీలకు ముందే సూచనలు అందుతాయని, వాటి ప్రకారమే… సెలబ్రెటీలు `నటిస్తుంటారు` అని చెప్పుకొనేవారు. ఇప్పుడు అదే నిజమని తేలిపోయింది.
బాలీవుడ్ బిగ్ బాస్ షోకి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొంటున్న జుబేర్ బిగ్ బాస్ నుంచి అనూహ్యంగా నిష్క్రమించాడు. బయటకు వచ్చాక.. బిగ్ బాస్‌లో ఉన్న చీకటి కోణాల్ని బయటపెట్టాడు. ఈ షో ఉత్తి ఫేక్ అని, టీఆర్పీ రేటింగుల కోసం కావాలని డ్రామాలు ఆడతారని విమర్శించాడు. బిగ్ బాస్‌లో పాల్గొన్న సెలబ్రెటీలంతా తమ పారితోషికాల కోసం ఓపిగ్గా ఈ అన్యాయాల్ని భరిస్తున్నారని లేదంటే… ఈ షో నుంచి అందరూ ఎప్పుడో బయటకు వచ్చేసేవారని చెప్పాడు. జుబేర్ ఎలిమినేషన్‌లోనే చాలా డ్రామా నడిచింది. ఎలిమినేషన్‌కి ముందు జుబేర్, సల్మాన్ ఖాన్ ల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. జుబేర్ బయటకు వచ్చాక ఏదో ఓ సంచలనం సృష్టిస్తాడని అందరూ ఊహిస్తూనే ఉన్నారు. మొత్తానికి బిగ్ బాస్‌పై ఓ బాంబు విసిరాడు జుబేర్. ఈ షోలో పాల్గొన్న సెలబ్రెటీనే ఇది ఫేక్ అంటున్నాడంటే.. ఎంతో కొంత నమ్మక తప్పదు. కేవలం హిందీ షోనే ఇలా నడిచిందా?? తెలుగు సంగతీ ఇంతేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయిప్పుడు.