‘స్టార్ మా’ తెలుగు ఛానల్ లో ప్రసారమైన ‘బిగ్ బాస్’ కార్యక్రమం యాజమాన్యానికి లాభాలు తీసుకొచ్చింది. బిగ్ బాస్ కార్యక్రమమే కాదు ‘బిగ్ బాస్’ కోసం వేసిన సెట్ కూడా ఇప్పుడు లాభాలు తీసుకొస్తోంది. ‘బిగ్ బాస్’ తొలి సీజన్ షూటింగ్ పుణేలో చేశారు. హిందీ ‘బిగ్ బాస్’ కోసం వేసిన సెట్ లో తెలుగు ‘బిగ్ బాస్’ షూటింగ్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 2 కోసం హైదరాబాద్ లో అన్నపూర్ణ ఏడెకరాలు స్టూడియోలో ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు. ఇప్పుడీ సెట్ లక్ష్మీదేవిలా కాసులు కురిపిస్తోంది. లాభాల పంట పండిస్తోంది.
‘బిగ్ బాస్ 2’ సీజన్ పూర్తయిన తర్వాత అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన ‘బిగ్ బాస్ హౌస్’లో చాలా షూటింగులు జరుగుతున్నాయి. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో కొంత భాగాన్ని ఆ ‘బిగ్ బాస్ హౌస్’లోనే తీశారు. సినిమాకు తగ్గట్టు హౌస్ లో సెట్టింగులు వేశారు. ఇప్పుడు అదే హౌస్ లో ఈటీవీ లో ప్రసారమయ్యే ‘స్వరాభిషేకం’ ప్రోగ్రామ్ షూటింగ్ చేస్తున్నారు.
సాధారణంగా ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలను ఎక్కువశాతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ, కొన్నిటిని హైదరాబాద్ సిటీలోని స్టూడియోల్లో చేస్తున్నారు. సిటీ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు సెలబ్రిటీలను తీసుకు తీసుకువెళ్లడానికి వెహికల్స్ గట్రా ఏర్పాటు చేయాలి. అలాగే, స్టూడియో రెంట్ కూడా కట్టాలి. అదే ఇక్కడ స్టూడియోలో చేస్తే వెహికల్స్ ఖర్చు కొంతవరకు తగ్గుతుంది. టైమ్ కూడా కలిసి వస్తుంది. అందుకని, ఇక్కడే షూటింగ్ చేస్తున్నార్ట. షూటింగులకు సెట్ ఫ్రీగా ఇస్తారా ఏంటి? డబ్బులు ఇవ్వాల్సిందే.