బిగ్ బాస్ 2 సెషన్‌తో హీరో అయిపోయాడు కౌశల్. నిజానికి ఈ షో ప్రారంభ రోజుల్లో కౌశల్‌ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎలిమినేట్ అయ్యే తొలి సభ్యుల్లో కౌశల్ కూడా ఉంటాడని భావించారు. కానీ అనూహ్యంగా ‘ఈ బిగ్ బాస్ షో అంతా భూటకం’ అంటూ.. కౌశల్ ఒక్కసారిగా రెచ్చిపోవడంతో కళ్లన్నీ అతనిపై పడ్డాయి. `నేను ఒంటరిని` అనే ట్యాగ్‌లైన్ పట్టుకుని సింపథీ సంపాదించుకునే ప్రయత్నం చేశాడు. అది వర్కవుట్ అయ్యింది కూడా. ఆ తరవాత జరిగిన పరిణామల దృష్ట్యా.. బిగ్ బాస్ అంతా ఓ వైపు కౌశల్ మరో వైపూ అన్నట్టు తయారైంది వ్వవహారం. ఇవన్నీ కౌశల్‌కి కలిసొచ్చాయి. ప్రేక్షకుల్లో సానుభూతి పోగు చేసుకునే అవకాశం ఏర్పడింది. అదెంత వరకూ వెళ్లిందంటే ‘కౌశల్ ఆర్మీ’ అనే ఓ గ్రూపు ఏర్పడి కౌశల్ తరపున మద్దతు కూడగట్టింది. ఇవన్నీ ‘బిగ్ బాస్ 2’నీ, అందులోని కౌశల్‌ని హైలెట్ చేయడానికి ఉపయోగపడ్డాయి. మొత్తానికి కౌశల్ ఆర్మీనే గెలిచింది. కౌశల్‌ని బిగ్ బాస్ 2 విన్నర్‌గా గెలిపించుకుంది. ఈ ప్రైజ్ మనీ ద్వారా వచ్చిన రై.50 లక్షల్నీ కాన్సర్ బాధితుల సహాయార్థం ఉపయోగిస్తానని చెప్పి కౌశల్ మరోసారి అందరి అభిమానాన్నీ సంపాదించుకోగలిగాడు.
బిగ్ బాస్ ప్రహసనం పూర్తయ్యింది. దీంతో కౌశల్ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. మరి తరవాతేంటి?? కౌశల్ టార్గెట్ ఇప్పుడు సినిమాలపై పడిందనడం కంటే… కౌశల్‌పై ఇప్పుడు సినీ పరిశ్రమ దృష్టి పడబోతోందనడం సమంజసం. కౌశల్ ఇది వరకు చిన్న చిన్న పాత్రలు పోషించాడు. టీవీ సీరియళ్లలో ప్రతినాయకుడిగా కౌశల్ ప్రసిద్ది పొందాడు. అయితే బిగ్ బాస్ తోనే తనకు గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ విన్నర్‌గా కౌశల్‌కి సినిమా అవకాశాలు వస్తాయా?? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత సీజన్ విన్నర్ శివ బాలాజీకి బిగ్ బాస్ ద్వారా వచ్చిన ప్రత్యేకమైన మైలేజీ ఏమీ లేదు. బిగ్ బాస్ కి ముందు శివ బాలాజీ కెరీర్ ఎలా ఉందో, ఆ తరవాతా అలానే ఉంది. కాకపోతే… కౌశల్ పరిస్థితి వేరు. ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేశాడు. కౌశల్ ఆర్మీ అంటూ ఓ అభిమాన గణం కౌశల్ వెనుక ఉంది. అందుకే.. దాన్ని చిత్రసీమ క్యాష్ చేసుకోవొచ్చు. మరీ హీరోగా అవకాశాలు రాకపోవొచ్చు గానీ, కీలక పాత్రలు, ప్రతినాయకుడి పాత్రలూ కౌశల్‌కి దక్కే ఛాన్సుంది. అయితే… దాన్ని కౌశల్ ఎంత వరకూ సద్వినియోగ పరచుకుంటాడన్నదే కీలకం. ఇప్పటికే ఒకరిద్దరు నిర్మాతలు కౌశల్ హీరోగా సినిమాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం అందుతోంది. అయితే కౌశల్ హీరో పాత్రలవైపు కాకుండా, ఇలా నెగిటీవ్ టచ్ ఉన్న పాత్రలు ఎంచుకుంటే.. తనకు కొంతకాలం ఢోకా ఉండకపోవొచ్చు.