సెలబ్రెటీల లిస్టులో ‘స్టార్లు’ కనిపించకపోవడంతో బిగ్ బాస్ వెలుగు కాస్త తగ్గిన మాట నిజం. వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ రావడంతో.. బిగ్ బాస్‌పై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాల స్థాయిని అందుకోవడంలో బిగ్‌బాస్ విఫలమైందన్నది విశ్లేషకుల మాట. సంపూ, ముమైత్ ఖాన్కాస్త హడావుడి చేస్తున్నా.. రాను రాను అదీ తగ్గిపోయింది. బిగ్ బాస్ షోలో సెలబ్రెటీలు నిద్రపోవడానికే ప్రాధాన్యం ఇవ్వడం,కదలకుండా ఓ చోట కూర్చోవడం, కబుర్లతో కాలక్షేపం చేయడంతో బిగ్ బాస్ మజా క్రమంగా తగ్గిపోతోంది. నిబంధనలు కూడా కఠినతరంగా ఉండడంతో షోలో పాల్గొన్న సెలబ్రెటీలు అసహనం వ్యక్తం చేయడం కూడా టీవీల్లో కనిపిస్తూనేఉంది. పరిస్థితి ఇలానే ఉంటే… బిగ్ బాస్ షో రేటింగులు ఊహించని స్థాయిలో పడిపోవడం ఖాయమని నిర్వాహకులు భయపడుతున్నారు. అందుకే తక్షణం దిద్దుబాటు చర్యలకు రంగం సిద్ధం చేసుకొంటున్నట్టు సమాచారం.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొంంతమంది సెలబ్రెటీలను రంగంలోకి దించాలని బిగ్ బాస్టీమ్ భావిస్తోంది. వీలైనంత వరకూ పాపులర్ యాంకర్లను గానీ, ప్రస్తుతం ఖాళీగా ఉన్న కథానాయికల్ని గానీ రంగంలోకి దింపాలని చూస్తోంది. అయితే.. అందుకే ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అనసూయని సంప్రదిస్తే.. పది రోజులు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండడానికి ఒప్పుకొందట. అయితే… ఆ పది రోజులకు గానూ.. భారీ ఎత్తున పారితోషికం డిమాండ్ చేసిందని తెలుస్తోంది. కనీసం నాలుగువారాలైనా బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలని టీమ్ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. అయితే… ఎంత పారితోషికం ఇచ్చినా నాలుగు వారాలు ఉండడం కుదరని పని అని తెగేసి చెప్పిందట.
మంచు లక్ష్మి, తేజస్వినిలను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపిద్దామనుకొంది టీమ్. అయితే ఇప్పుడు వాళ్లు కూడా ‘అప్పుడే కాదు.. ఇంకాస్త టైమ్ తీసుకొని వెళ్తాం’ అంటున్నార్ట. సిట్ విచారణ నిమిత్తం ముమైత్ ఖాన్ కూడా షోలోంచి బయటకు వచ్చేస్తోంది. తిరిగి ఆమెకు ఎంట్రీ లభిస్తుందో, లేదో చెప్పడం కష్టం. ముమైత్ స్థానంలో ఇంకా ఆకర్షణీయమైన సెలబ్రెటీ పంపాలని చూస్తున్న షో నిర్వాహకుల ప్రయత్నాలు సజావుగా సాగడం లేదు. ఈ దశలో లోపల ఉన్నవాళ్లు ఎలిమినేట్ రూపంలో బయటకు వచ్చేయాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఏదో అద్భుతం జరిగి.. బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని రీతిలో డ్రామా మొదలైతే గానీ… బిగ్ బాస్ షో రక్తి కట్టడం కష్టం. మరి ఏం జరుగుతుందో చూడాలి.