టాలీవుడ్లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. 12 మంది సినీ ప్రముఖులకు సిట్.. నోటీసులు జారీ చేయడం.. వాళ్లు ఒకొక్కరిగా విచారణకు హాజరుకావల్సిరావడం తెలిసిన విషయాలే. ఈ నెల 19 నుంచి 27 మధ్య ఒకొక్కరూ ఒక్కో రోజు సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారు. తొలి కాల్షీటు దర్శకుడు పూరి జగన్నాథ్దే. అయితే… ఈ జాబితా నుంచి ముమైత్ ఖాన్ని మినహాయించినట్టు సమాచారం. పోలీసుల లిస్టు ప్రకారం 21న ముమైత్ విచారణకు హాజరు కావాల్సివుంది. అయితే.. ముమైత్ ప్రస్తుతం బిగ్ బాస్ షోలో పాల్గొంటోంది. ఆ గేమ్ రూల్స్ ప్రకారం 70 రోజుల పాటు బయటి ప్రపంచంతో వాళ్లకు ఎలాంటి సంబంధాలూ ఉండవు. ముమైత్ పరిస్థితి గమనించిన సిట్ అధికారులు.. ఆమెకు విచారణ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే… అత్యవసరం అనుకొంటే మాత్రం విచారణకు హాజరుకావల్సిందేనని సిట్ అధికారులు సూచించార్ట. దానికి ముమైత్ కూడా ఓకే అన్నట్టు తెలుస్తోంది. ముమైత్ స్థానంలో వ్యక్తిగత న్యాయవాది సిట్ ఎదురుగా హాజరయ్యే అవకాశాలున్నాయి. మరో 70 రోజులు అంటే.. అప్పటికి.. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో ఏమో..?? మొత్తానికి బిగ్ బాస్ వల్ల ముమైత్కి తాత్కాలిక ఉపశమనం లభించింది.