మల్టీస్టారర్ల తరం ఇది. ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. రామ్ చరణ్ – ఎన్టీఆర్‌లు కలిస్తే బాక్సాఫీసు ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యక్షంగా చూశాం. ఇప్పుడు ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి ‘వార్ 2’ చేస్తున్నారు. ఇప్పుడు దేశం మొత్తం తనవైపుకు తిరిగి చూసేలా ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు అట్లీ.
‘జవాన్’తో ఓ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు అట్లీ. షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొంది. ఆ తరవాత సల్మాన్ – విజయ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు వచ్చాయి. వాటిపై అట్లీ సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో మాత్రం తన తదుపరి సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
తన తదుపరి సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని, ఈ సినిమాలో స్టార్స్ చూసి అంతా ఆశ్చర్యపోతారని, అవుటాఫ్ ది వరల్డ్ ఐడియాతో ఈసారి సినిమా చేస్తున్నానని ఊరించేశాడు అట్లీ. తమిళ పరిశ్రమ కూడా అట్లీ తదుపరి సినిమా గురించి చాలా ఆసక్తిగా చర్చించుకొంటోంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కోసం అట్లీ ప్లాన్ చేస్తున్నాడని, ఈ సినిమాలో ఇద్దరు కాదని, ఏకంగా నలుగురు స్టార్లు ఉంటారని, ప్రతీ పాత్రకూ క్రేజీ స్టార్‌నే రంగంలోకి దింపాలని అట్లీ ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. తెలుగు నుంచి కూడా ఓ ప్రముఖ హీరో ఈ ప్రాజెక్టులో భాగం పంచుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.