సల్మాన్ ఖాన్ ‘సికందర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. రెండో రోజే చాలా చోట్ల ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఇది మామూలు పరాజయం కాదు. ఈద్ కి బాలీవుడ్ నుంచి ఒక పెద్ద సినిమా రావడం ఆనవాయితీ. రిజల్ట్ ఎలా ఉన్నా సరే వీకెండ్ వరకు సినిమా ఓ మోస్తారుగా జనాదరణ పొందుతుంది. కానీ సికిందర్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.
సల్మాన్ ఖాన్ ఫామ్ లో లేరు. ఆయన గత సినిమాలన్నీ వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. అయితే రెండో రోజుకే షోలు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదు. అందులోనూ రంజాన్ లాంటి పండగ సమయంలో సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమా షోలు క్యాన్సిల్ అవ్వడం అనేది నిజంగా పెద్ద పరాభవం.
అయితే ఈ పరాభవానికి కారణం సల్మాన్ ఖాన్ స్వయంకృతం అనే చెప్పాలి. సల్మాన్ ఖాన్ గత కొన్నేళ్ళుగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్న విధానంలో పెద్ద ఆకర్షణ కనిపించడం లేదు. ఒక క్రేజీ డైరెక్టర్, క్రేజీ కాంబినేషన్ తో ప్రాజెక్ట్స్ కుదుర్చుకోవడంలో వెనుకబడ్డారు. కంటెంట్ విషయంలో కూడా మారుతున్న ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు కథల ఎంపిక చేసుకోవడంలో ఆయన వెనకడుగు కనిపిస్తోంది.
సికందర్ దర్శకుడు మురగదాస్. సినిమా అంతా సౌత్ ఫ్లవర్ తో నింపారు. అయితే సౌత్ ని కూడా ఈ సినిమా టార్గెట్ చేయలేదు. అసలు తెలుగు, తమిళ్ డబ్బింగ్ వర్షన్స్ అందుబాటులో లేవు. అలాంటప్పుడు ఇక్కడ ఆడియన్స్ ఈ సినిమాపై ఎలా ఆసక్తి చూపిస్తారు? అంతే కాదు ఈ సినిమాని సరిగ్గా ప్రమోట్ చేసుకోలేదు సల్మాన్. కనీసం హైదరాబాద్ వచ్చి మీడియాని కలవలేకపోయారు. ఏదో సినిమా తీసాం.. రిలీజ్ చేసాం అనే ధోరణే కనిపించింది. బహుశా సల్మాన్ ఈ సినిమా రిజల్ట్ ముందే పసిగట్టారేమో.
ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అభిమానులు సినిమాని మోసే పరిస్థితి లేదు. ఎంత పెద్ద స్టార్ సినిమా అయిన సరే మంచి కంటెంట్, ప్రమోషన్స్, మార్కెటింగ్ అవసరం అవుతున్నాయి. సినిమా తీయడంతో పాటు ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకొచ్చే బాధ్యత హీరోల మీదే వుంది. ఎంతటి సూపర్ స్టార్ అయినా మారుతున్న అభిరుచులు, సమీకరణలు, పరిస్థితులు గ్రహించి సినిమాలు తీస్తేనే మనుగడ వుంటుందనే సత్యాన్ని సికందర్ ఫలితంతో అర్ధం చేసుకోవచ్చు.